Iran Israel Tensions In Middle East : ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. లెబనాన్ నుంచి తమ భూభాగంలోకి 240 రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఉత్తర ఇజ్రాయల్‌పైకి రాకెట్ దాడులు కొనసాగుతున్నట్లు టెలిగ్రామ్‌లో వివరించింది. ఇదే సమయంలో తాము కూడా లెబనాన్‌పై వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. లెబనాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని, వెళ్లినవాళ్లు ప్రస్తుతానికి తిరిగి రావద్దని హెచ్చరించింది. మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ మరోసారి బాంబు దాడికి దిగింది. సెంట్రల్ బీరుట్‌లో భారీ శబ్ధం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. లెబనాన్ పార్లమెంటు సమీపంలోని ఓ భవనంపై బాంబు పడినట్లు వెల్లడించారు. ఈ దాడిలో అపార్ట్‌మెంట్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు దృశ్యాలు వెలువడ్డాయి.
లెబనాన్‌పై దాడుల స్పీడ్ పెంచిన ఇజ్రాయెల్
హెజ్‌బొల్లా బలంగా ఉన్న దక్షిణ బీరుట్‌లోని దహియా ప్రాంతంపైనా ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. హెజ్‌బొల్లా స్థావరాలపై మరిన్ని దాడులు జరుగుతాయని, సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీచేసింది. లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను పంపేందుకు ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే రిజర్వు బలగాలను సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది.
హెజ్‌బొల్లా చీఫ్ అల్లుడు మృతి
గత వారం బీరుట్‌లో జరిగిన దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మృతిచెందగా, అందులో ఆయన కుమార్తె కూడా మృతి చెందినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. తాజాగా నస్రల్లా అల్లుడు మృతి చెందినట్లు సమాచారం. సిరియా డమాస్కస్‌లోని మజ్జే జిల్లాలో నివాస భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు లెబనాన్‌వాసులు మృతి చెందారు. వారితో పాటు హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్- ఖాసిర్ సైతం మరణించినట్లు సిరియన్ మానవ హక్కుల అబ్జర్వేటరీ తెలిపింది. హెజ్‌బొల్లాకు చెందిన ఓ మీడియా సైతం దీన్ని ధ్రువీకరించింది.
లెబనాన్‌లో అమెరికా పౌరుడు మృతి
మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో తమ పౌరుడు సైతం మృతి చెందినట్లు ఆమెరికా తెలిపింది. వాషింగ్టన్- మిచిగాన్‌లోని డియర్‌బోర్న్‌కు చెందిన కమెల్ అహ్మద్ జావెద్ మృతి చెందినట్లు ప్రకటించింది. అహ్మద్ మృతి తమను ఎంతో బాధకు గురిచేసిందని శ్వేతసౌధం పేర్కొంది. బాధితుడి కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల నుంచి వృద్ధులు, దివ్యాంగులకు సాయం చేసేందుకు బయటకు వెళ్లగా ఆ ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో తన తండ్రి మరణించినట్లు అహ్మద్ జావెద్ కుమార్తె వెల్లడించింది.
మేం యుద్ధం కోరుకోవడం లేదు, కానీ! : ఇరాన్
ఇజ్రాయెల్ బలవంతంగా తమను ఘర్షణలోకి లాగిందని ఇరాన్ తెలిపింది. తాము యుద్ధం కోరుకోవడం లేదని, శాంతిని ఆశిస్తున్నామని తేల్చిచెప్పింది. ఇజ్రాయెల్‌తో ఘర్షణ నేపథ్యంలో దేశాల మద్దతు కూడగట్టేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బుధవారం ఖతార్ వెళ్లారు. ఖతార్‌తో ద్వైపాక్షిక చర్చలతోపాటు ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆసియా దేశాల మద్దతు కూడగట్టేందుకు యత్నించనున్నారు. వారంపాటు ప్రశాంతంగా ఉంటే గాజాలో శాంతి నెలకొల్పుతామని, అమెరికా, ఐరోపా దేశాలు కోరాయన్న ఆయన అందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. కానీ ఇజ్రాయెల్ ఇంకా హత్యలు చేస్తూనే ఉందని, అది నేరాలను ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడి చేస్తే మరింత భయంకరంగా ప్రతి దాడి చేస్తామని హెచ్చరించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు- మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందా? - Is World War 3 Coming
ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్స్ అవేనా? ఇరాన్ టాప్ లీడర్‌పైనే గురి పెట్టిందా? - Israel Iran Conflict