Canada Allegations On India : భారత్‌పై కెనడా మరోసారి వివాదాస్పద ఆరోపణలు చేసింది. భారత్‌ను తమ ఎన్నికల్లో జోక్యం చేసుకునే విదేశీ ముప్పుగా భావిస్తూ కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసు నివేదిక రూపొందించింది. కెనడా ప్రజాస్వామ్యం, విలువలు, సార్వభౌమత్వాన్ని విదేశీ శక్తులు బలహీనపరచే అవకాశాలున్నట్లు నివేదికలో హెచ్చరించింది. ఎన్నికల్లో విదేశీ జోక్యం అనేది భిన్న సాంస్కృతిక సమాజం కలిగిన కెనడాలో సాంఘిక సమన్వయాన్ని తగ్గించి కెనడియన్ల హక్కులకు భంగం కలిగేలా చేస్తుందని వివరించింది.
తమ ఎన్నికలను చైనా, రష్యాలు ప్రభావితం చేస్తున్నాయని ఎప్పటినుంచో ఆరోపిస్తున్న కెనడా తొలిసారి భారత్‌పై ఆ తరహా ఆరోపణలు గుప్పించింది. అయితే కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి సమర్పించిన తాజా నివేదికలో చైనానే అతిపెద్ద విదేశీముప్పుగా పేర్కొంది. 2019, 2021 ఫెడరల్ ఎన్నికలను రహస్యంగా మోసపూరితంగా ప్రభావితం చేయడానికి చైనా యత్నించిందని నివేదికలో గుర్తుచేసింది. గతేడాది తమ పౌరుడైన ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. ఫలితంగా భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
నిజ్జర్ స్నేహితుడి ఇంటిపై కాల్పులు - కెనడా దర్యాప్తు
భారత్- కెనడా మధ్య దౌత్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య సంఘటన మరువకముందే మరో ఘటన జరిగింది. బ్రిటిష్ కొలంబియా పరిధిలోని దక్షిణ సర్రేలో ఉంటున్న నిజ్జర్ స్నేహితుడు సిమ్రన్‌జీత్ సింగ్ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని కెనడాకు చెందిన సీబీఎన్ న్యూస్ శుక్రవారం వెల్లడించింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం
గురువారం తెల్లవారుజామున 1.20 సమయంలో స్థానిక 154 స్ట్రీట్‌లోని 2800 బ్లాక్ వద్ద కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల వారిని దర్యాప్తు చేస్తారు. అలానే సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. కాల్పుల్లో దెబ్బతిన్న ఓ కారును అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటి తలుపులపై దాదాపు 10 వరకు తూటాలు దిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ఖలిస్థానీ గ్రూపులు మాత్రం ఈ దాడి వెనక భారత్ హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. ఇటీవలే భారత్ కాన్సులేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో సిమ్రన్‌జీత్ కీలకపాత్ర పోషించడం వల్లే ఈ దాడి జరిగిందని వారు చెబుతున్నారు.
'ఖలిస్థానీల ఏరివేతకు మిషన్! సీక్రెట్ మెమో జారీ'- క్లారిటీ ఇచ్చిన కేంద్రం
విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్- విదేశీ స్టడీ పర్మిట్లపై కెనడా పరిమితి