Amazon Donation To Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనితో కాబోయే అధ్యక్షుడితో తమ సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రముఖ టెక్ కంపెనీలు అన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల మెటా సంస్థ ట్రంప్ ప్రమాణస్వీకార నిధికి 1 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.8 కోట్లు) విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ సైతం ఇదే తరహాను స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ట్రంప్ ప్రమాణస్వీకార నిధికి 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.8 కోట్లు) విరాళం ఇచ్చే యోచనలో అమెజాన్ ఉన్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
ట్రంప్ ధైర్యానికి జోహార్
అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో మొదటిసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. రక్తమోడుతున్న గాయంతో వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ పిడికిలి బిగించి 'ఫైట్' (పోరాడండి) అని గట్టిగా నినదించారు. దీనిపై అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్పందిస్తూ ట్రంప్‌నకు మద్దతును తెలిపారు. "దుండగులు తూటాలతో ట్రంప్‌పై దాడి చేసినా ఆయన భయపడకుండా ఎదురు నిలిచి, అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు" అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ట్రంప్‌తో జుకర్‌బర్గ్ భేటీ
ఇటీవల ట్రంప్‌తో మెటా సీఈఓ మాక్ జుకర్‌బర్గ్ భేటీ అయ్యారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి విందు చేశారు. ఆ తరువాత ట్రంప్‌నకు మెటా 1 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చే టెక్ విధానాలు తమకు అనుకూలంగా ఉండాలని జుకర్‌బర్గ్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
మస్క్ Vs బెజోస్
ప్రపంచ కుబేరుడు మస్క్, బెజోస్‌కు మధ్య చాలా కాలంగా గట్టి పోటీ కొనసాగుతోంది. బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్, మస్క్‌కు సంబంధించిన స్పేస్‌ఎక్స్ మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో మస్క్, బెజోస్‌పై పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతారని కాబట్టి టెస్లా, స్పేస్ ఎక్స్‌కు సంబంధించిన స్టాక్స్‌ను కొనుగోలు చేయకూడదని బెజోస్ తన స్నేహితులకు సలహా ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. దీనిపై బెజోస్ స్పందిస్తూ ఆయన మాటల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపడేశారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జిన్‌పింగ్ రావడం కష్టమే!
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా మరోమారు విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. అయితే ఈ వేడుకకు జిన్‌పింగ్ హాజరుకాకపోవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.
జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపించారు. ఈవిషయాన్ని ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్ లీవిట్టే ధ్రువీకరించారు. "కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అమెరికా మిత్ర దేశాలతోనే కాకుండా ప్రత్యర్థులు, పోటీదారులతో కూడా సంభాషణకు సిద్ధంగా ఉన్నారు. అందుకు ఇది ఒక ఉదాహరణ. మొదటి దఫా పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాగే వ్యవహరించి, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ సంభాషణల ఫలితంగా ప్రపంచంలో శాంతియుత పరిస్థితులే కొనసాగాయి" అని ఆమె గుర్తుచేశారు. అయితే డొనాల్డ్ ఆహ్వానాన్ని జిన్‌పింగ్ అంగీకరించారో, లేదో మాత్రం ఆమె వెల్లడించలేదు.
ఈ ఆహ్వానంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం కూడా ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు ఇటీవల ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ మధ్యే తాము మాట్లాడుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే తాను అధికార బాధ్యతలు చేపట్టాక చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ధీటుగా స్పందించారు. చైనా- అమెరికా మధ్య టారిఫ్, టెక్ యుద్ధాల్లో విజేతలు ఉండరని వ్యాఖ్యానించారు. తమ దేశ ప్రయోజనాలను పరిరక్షించుకుంటామన్నారు.