Why Biopsy Test Is Required : మనకు వచ్చే అనారోగ్య సమస్యలను లక్షణాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు జ్వరం లాంటి అనారోగ్యం వస్తే శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసిన తర్వాత వైద్యులు జ్వరానికి సంబంధించిన మందులు ఇచ్చి వాటిని వాడమని చెబుతారు. కొన్నిసార్లు జ్వరం ఎక్కువ రోజులు ఉందని తేలితే, రక్తపరీక్ష లాంటివి చేయిస్తారు. దీని వల్ల టైఫాయిడ్, మలేరియా లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది బయటపడుతుంది.
బయాప్సీ అంటే ఏంటి?
Biopsy Test In Telugu : ఇలా అనారోగ్య సమస్యలను బట్టి రకరకాల పరీక్షలను చేస్తారు. సాధారణంగా రక్తపరీక్షలు, ఎక్స్-రే, స్కానింగ్ చేయడం ద్వారా అనారోగ్య సమస్య ఏంటనేది తేలిపోతుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఎన్ని పరీక్షలు చేసినా అసలు అనారోగ్య సమస్య ఏంటనేది పరీక్షల్లో వెల్లడికాదు. అలాంటి సందర్భాల్లో డాక్టర్లు ఉపయోగించే విధానమే బయాప్సీ. అనారోగ్యం లేదా రోగం మూలాల గురించి తెలుసుకునే పరీక్షే ఈ బయాప్సీ.
బయాప్సీ చేస్తారిలా!
సాధారణంగా క్యాన్సర్ నిర్ధరణకు బయాప్సీ చేయించాలని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే చాలామంది బయాప్సీ అనగానే క్యాన్సర్ అని అనుమానపడటం, భయపడటం లాంటివి చేస్తుంటారు. అయితే బయాప్సీ పద్ధతిలో ఎముక మూలుగ నుంచి కానీ ఎండోస్కోపిక్ పద్ధతిలో కానీ సూదిని గుచ్చి చర్మకణాలను సేకరించడం ద్వారా లేదంటే సర్జరీ చేయడం ద్వారా కానీ కణజాలాన్ని సేకరిస్తారు. దీనిని మైక్రోస్కోప్ సాయంతో పరీక్షిస్తారు. అనుభవం కలిగిన పాథాలజిస్ట్ క్యాన్సర్ కణాలను సులువుగా కనిపెడతారు.
బయాప్సీలో నెగెటివ్ రిపోర్ట్ వస్తే?
మామూలుగా క్యాన్సర్ నిర్ధరణ కోసం బయాప్సీని ఎక్కువగా చేయిస్తుంటారు. కానీ నిజానికి ఇతర అనేక అనారోగ్య సమస్యలను గుర్తించడానికి కూడా వైద్యులు ఈ పద్ధతిని వినియోగిస్తుంటారు. దీని ఫలితంగా రోగం లేదా అనారోగ్య సమస్యలకు అసలు మూలాలు ఏంటనే విషయం తేలిపోతుంది. రక్తపరీక్ష, ఎక్స్-రే, స్కానింగ్ ద్వారా వెల్లడి కాని కచ్చితమైన ఫలితాలు బయాప్సీ ద్వారా బహిర్గతం అవుతాయి. అందుకే వైద్యులు చివరి టెస్ట్ కింద బయాప్సీకి రెఫర్ చేస్తుంటారు. కొన్నిసార్లు బయాప్సీలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చినా, వైద్యులకు అనుమానం కలిగితే మరోసారి బయాప్సీని తీయించమని సూచించవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పీరియడ్స్ టైంలో విపరీతమైన నడుము నొప్పా? ఇలా చేస్తే బిగ్ రిలీఫ్ పక్కా! - How To Reduce Back Pain