IDIOT Syndrome Symptoms : ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక మానవాళికి ఎంత లబ్ధి జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న సమస్యకైనా క్షణాల్లోనే ఒక్క క్లిక్‌తో పరిష్కారం కనుక్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి ఇంటర్నెట్‌లో(Internet), యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తూ ఎవరికి వారే డాక్టర్లు అయిపోతున్నారు. మీరూ అదే విధంగా చేస్తున్నారా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మీరు ఇడియట్ సిండ్రోమ్(IDIOT Syndrome) బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలేంటి, ఇడియట్ సిండ్రోమ్? దీని లక్షణాలేంటి? ఎలాంటి పరిణామాలుంటాయి? ఎలా బయటపడాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటంటే?: ఆరోగ్యంపై ఆందోళనతో అనవసరంగా ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో పదే పదే సెర్చ్ చేయడాన్ని 'ఇడియట్ సిండ్రోమ్'గా పిలుస్తారంటున్నారు నిపుణులు. IDIOT Syndrome అంటే.. ‘ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్‌స్ట్రక్షన్ ట్రీట్మెంట్’ సిండ్రోమ్. దీన్నే వైద్య పరిభాషలో 'సైబర్‌కాండ్రియా' అని కూడా పిలుస్తారు. ఇటీవల కాలంలో చాలా మంది తమకున్న లక్షణాల ఆధారంగా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి జబ్బు ఏంటో నిర్ధారించుకుని డాక్టర్‌ను సంప్రదించకుండానే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు.
ఇడియట్ సిండ్రోమ్ లక్షణాలు :
- ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారు తీవ్ర ఆందోళనలో ఉంటారంటున్నారు నిపుణులు.
- చిన్నపాటి లక్షణాలకే తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నట్లు ఆందోళన చెందడం.
- అనవసరంగా గంటల తరబడి వైద్య సమాచారం కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం.
- ఇంటర్నెట్‌లో లభించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా దిగులు చెందడం.
- ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ఇప్పటికే ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్‌కు సంబంధించి విపరీత నిర్ణయాలు తీసుకోవడం.
- వైద్యులు ఇచ్చే సమాచారాన్ని నమ్మకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు
2021లో 'జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. IDIOT సిండ్రోమ్‌తో బాధపడుతున్నవారిలో ఆందోళన, నిరాశ స్థాయిలు మిగతావారికంటే ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆక్యుపేషనల్ థెరపీ ప్రొఫెసర్ డాక్టర్ A. స్మిత్ పాల్గొన్నారు. ఇడియట్ సిండ్రోమ్ ఉన్నవారు ఆందోళనతో ఇబ్బందిపడతారని ఆయన పేర్కొన్నారు.
ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటే?
- ఇడియట్ సిండ్రోమ్‌తో (IDIOT Syndrome) బాధపడేవారు పూర్తిగా ఆన్లైన్ సెర్చ్‌పై ఆధారపడితే జబ్బును తప్పుగా నిర్ధారించే ప్రమాదం ఉందని.. ఫలితంగా ఒక్కోసారి వారికి లేని సమస్యకు చికిత్స చేసుకోవచ్చని.. లేదా నిజంగా ఆందోళన చెందాల్సిన వ్యాధి ఉన్నా గుర్తించలేకపోవచ్చంటున్నారు నిపుణులు. దాంతో ఉన్న వ్యాధి మరింత ముదిరి ప్రాణానికే ముప్పు రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
- అదే పనిగా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తూ తీవ్ర ఆందోళనకు గురై మానసికంగానూ దెబ్బతినొచ్చని సూచిస్తున్నారు.
- సాధారణంగా ఇంటర్నెట్‌లో అందరిలో కనిపించే లక్షణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. అవి ఉన్నంతమాత్రాన కచ్చితంగా అదే జబ్బని నిర్ధరించాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.
మీ పొట్టలో సమస్యా? - అయితే అది ఐబీఎస్ కావొచ్చు!
ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే?
- కొంతమంది చిన్నపాటి లక్షణాలున్నంత మాత్రాన వారికి వారే ఏదో పెద్ద అనారోగ్యం ఉన్నట్లు కుంగిపోతుంటారు. ఇది మరింత ఆందోళన, మానసిక సమస్యలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి టైమ్‌లో వైద్యులు ధ్రువీకరించకుండా ఎవరూ ఎలాంటి నిర్ణయానికి రావొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమని తాము తక్కువ చేసుకోవద్దని సూచిస్తున్నారు.
- ఆందోళన నుంచి బయటకు రావడానికి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్‌లను ఫాలో అవ్వాలని.. యోగా, డీప్ బ్రీతింగ్, ధ్యానం, కండరాలను వదులు చేసే వ్యాయామాల వంటి వాటిని ప్రయత్నించాలంటున్నారు.
- ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారమంతా నిజం కాదనే వాస్తవాన్ని గుర్తించాలని అంటున్నారు.
- ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఆందోళన నుంచి బయటకు రాకపోతే వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అసలు పైల్స్ ఎందుకొస్తాయి? - రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - Piles Symptoms and How to Cure