Correct Posture For Using Laptop : ప్రస్తుత సాంకేతిక యుగంలో దాదాపుగా ప్రతి పనీ.. ఫోన్, కంప్యూటర్‌తోనే ముడిపడి ఉంటోంది. అవి లేకుండా పని అంటే దాదాపు అసాధ్యమనే పరిస్థితికి చేరిపోయాం. అయితే.. అదే పనిగా స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను చూస్తూ పనిచేయడం వల్ల మనకు తెలియకుండానే అనారోగ్యం బారిన పడుతున్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు శారీరకంగా ఎంతో శ్రమించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలూ వచ్చేవి కావు.. కానీ ఇప్పుడు పూర్తిగా ఫోన్, కంప్యూటర్లో ముందు కుర్చుని చేసే పనులు ఎక్కువగా కావడం అనేక సమస్యలకు దారిస్తోందని చెబుతున్నారు.
వంగిపోతున్నారు..
ఫోన్, కంప్యూటర్ చూస్తున్నవారు తమకు తెలియకుండానే ముందుకు వంగిపోతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలా.. ఎక్కువ సమయం వంగి కూర్చోవడం వల్ల ఎముకలు, కీళ్లు, కండరాల మీద ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్ రెన్ కైలిట్, డాక్టర్ స్టార్ట్ మెక్ గిల్ వెల్లడించారు. ఎప్పుడో ఒక్కసారి అలా వంగి కూర్చుంటే పెద్దగా ప్రభావం ఉండదని.. అంతేగానీ తరచూ ముందుకు వంగుతుంటే లోపలి అవయవాల మీదా ప్రభావం పడుతుందని కనుగొన్నారు. దీని వల్ల ఊపిరితిత్తులు, పేగులు సరిగా పనిచేయవని.. చివరికి శ్వాస తగినంత తీసుకోకపోవటం, అజీర్ణం వంటి సమస్యలకూ దారితీస్తుందన్నారు.
భంగిమ దెబ్బతినకుండా చూసుకోవటమెలా?
ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి మార్గం నిటారుగా నిల్చోవటమని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల అటు అనారోగ్యం పాలుకాకుండా ఉండడంతోపాటు ఇటు ఆకర్షణీయంగా, ఆత్మ విశ్వాసంతో ఉన్నట్టూ కనిపిస్తారని తెలిపారు. తలను నిటారుగా పెట్టి, చుబుకాన్ని వెనక్కి లాక్కోవాలని సూచించారు. చెవులు భుజాల మీద మధ్యలో ఉండాలని సూచించారు. భుజాలను వెనక్కి వంచి, మోకాళ్లను తిన్నగా ఉంచి.. కడుపును లోపలికి తీసుకోవాలని వివరించారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు.
కుర్చీలో కూర్చున్న సమయంలో వీపు పూర్తిగా వెనకాల ఆనేలా చూసుకోవాలని చెప్పారు. సహజ వంపు దెబ్బతినకుండా వీపు వద్ద దిండు, తువ్వాల లాంటి వాటిని పెట్టుకోవాలన్నారు. పాదాలను నేలకు తాకించి, మోకాళ్లను 90 డిగ్రీల కోణంలో వంచి... ఒకే ఎత్తులో లేదా తుంటి కన్నా కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అదేపనిగా స్మార్ట్‌ఫోన్‌ను చూస్తున్నా కూడా.. వెన్నెముక మీద ఒత్తిడి పడుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను తగ్గించుకోవటానికి ఫోన్‌ను ఎదురుగా, కాస్త ఎత్తి పట్టుకోవాలని తెలిపారు. తలను కాకుండా కళ్లను కదల్చాలని వివరించారు.
వర్షాకాలంలో సైనసైటిస్ అవస్థలా? - ఈ ఆయుర్వేద చిట్కాలతో ఫుల్ రిలీఫ్! - Sinus Remedy Ayurveda