Tips to Grow Hair Fastly with Natural Ways: ఆడవాళ్ల అందాన్ని పెంచడంలో కురులు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే చాలా మంది పట్టుకుచ్చులా అందంగా, పొడవుగా ఉండే జుట్టు కావాలని కోరుకుంటారు. కానీ.. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వంటి పలు కారణాల వల్ల హెయిర్ విపరీతంగా ఊడిపోతోంది. దీంతో.. జుట్టు పెంచుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం అంతంత మాత్రమే. ఇలాంటి సమయంలో ఈ చిన్న టిప్స్ పాటిస్తే జుట్టు ఊడటం ఉండదని.. పైగా వేగంగా పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
- తల ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ దాన్ని శుభ్రం చేయడం తప్పనిసరి. కానీ తడిజుట్టును ఆరబెట్టడమే కొంచెం కష్టమైన పని. అందుకే చాలా మంది హెయిర్ డ్రయ్యర్ వాడుతుంటారు. అయితే దాని వేడి.. కురుల పెరుగుదలను అడ్డుకుంటుందని నిపుణులు అంటున్నారు. కేవలం స్టైలింగ్, స్ట్రెయిట్‌నింగ్ కోసం వాడేవే కాకుండా.. ఎండలో అతిగా తిరగడం, జడను గట్టిగా అల్లడం, తడిపోవాలని తువాలుతో కొట్టడం వంటివన్నీ చేటు చేసేవే అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండండని సలహా ఇస్తున్నారు. 2016లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వేడి స్టైలింగ్ టూల్స్(హెయిర్ డ్రైయ్యర్, స్ట్రెయిటెనర్లు, కర్లింగ్ ఐరన్లు) జుట్టు కుదుళ్లకు కేరాటిన్ నష్టాన్ని కలిగిస్తాయని కనుగొన్నారు. కేరాటిన్ నష్టం జుట్టును బలహీనపరుస్తుందని.. తద్వారా ఊడిపోవడానికి దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మార్క్ రోజర్స్ పాల్గొన్నారు.
- చాలా మంది తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేస్తారు. అయితే.. కండిషనర్ అప్లై చేసిన వెంటనే చిక్కులు బాగా వస్తాయనే ఉద్దేశంతో కొద్దిమంది తడి తలమీద దువ్వెన పెట్టి దువ్వుతుంటారు. అయితే ఈ ప్రక్రియ మేలు చేయడం మాట అటుంచితే కుదుళ్లకు హాని కలిగించి.. కురులు రాలే విధంగా చేస్తుందని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తడి వెంట్రుకలు మీద దువ్వెన పెట్టొద్దని.. జుట్టు ఆరేవరకూ ఆగి.. తరవాతే దువ్వాలని సలహా ఇస్తున్నారు.
- చాలా మంది జుట్టు రాలుతుందని, చుండ్రు పెరుగుతుందని భావించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అందులో చూపించే టిప్స్ ఫాలో అవుతుంటారు. అయితే కొన్నిసార్లు ఈ టిప్స్ మేలు చేయకపోగా చేటు చేస్తాయని.. వాటి ప్రభావం తొలుత చర్మం, కురులపైనే పడుతుందని అంటున్నారు. కాబట్టి నిపుణుల సలహా లేనిదే వాడకపోవడం మేలంటున్నారు.
- జుట్టు కట్ చేస్తే తొందరగా పెరగదని చాలా మంది కట్ చేయడానికి ఆలోచిస్తారు. కానీ రెండు నెలలకోసారైనా జుట్టును కత్తిరించుకోవాలని సూచిస్తున్నారు.
- ఎందుకంటే చిట్లడం, చివర్లు పొడిబారడం కూడా కురుల పెరుగుదలకు అవరోధంగా మారతాయని.. కాబట్టి వాటిని తొలగించడం తప్పనిసరని అంటున్నారు.
- జిడ్డుగా ఉంటుందని, సమయం లేదనే కారణంతో చాలా మంది జుట్టుకు నూనె పెట్టుకోరు. అయితే వారానికి రెండుసార్లు గోరువెచ్చని నూనెతో తలకు మర్దనా చేయడం వల్ల.. మాడుకి రక్తప్రసరణ బాగా జరుగుతుందని అంటున్నారు. ఇది కురులను సంరక్షిస్తుందని చెబుతున్నారు.
- మన రోజు వారి అలవాట్లలో భాగంగా ఉపయోగించే దిండు కూడా కేశాల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. సరైన పిల్లోస్ వాడకపోతే అవి కురుల్లోని సహజ నూనెలను పీల్చేయడమే కాకుండా.. రాపిడికి గురిచేసి వెంట్రుకలు తెగేలానూ చేయస్తాయని అంటున్నారు. కాబట్టి, శాటిన్ రకాలనే ఎంచుకోమని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.