Feeding Tips for Beginners : ఎదిగే చిన్నారులకు సరైన సమయానికి పోషకాహారం అందితేనే.. రోగనిరోధక శక్తి పెరిగి వారు ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడే ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. కానీ.. చాలా మంది పిల్లలు సరిగా తినరు. దీంతో పోషకాహార లోపం కారణంగా బక్కగా తయారవుతారు. ఇది చూసి తల్లులు మదనపడుతుంటారు. అయితే.. కొన్ని టిప్స్‌తో పిల్లలను తిండివైపు మళ్లించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
అలా చేయొద్దు..
కొంత మంది తల్లులు.. హెల్దీ ఫుడ్ తినిపించాలనే తాపత్రయంలో చిన్నారులకు ఇష్టం లేకున్నా బలవంతంగా తినిపిస్తారు. కానీ, ఇలా చేయకూడదని నిపుణులంటున్నారు. దీనివల్ల తినడంపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఆహారాన్ని మెత్తగా చేసి పిల్లలకు తినిపించకూడదని సూచిస్తున్నారు. దీనివల్ల నమలకుండానే ఆహారాన్ని మింగేస్తుంటారు. దంతాలొస్తున్న వయసులో పిల్లలు వాటిని ఉపయోగించకపోవడంతో ఆహారంతో లాలాజలం కలవదు. జీర్ణసమస్య ఎదురవుతుందని పేర్కొన్నారు.
సహనంతో తినిపించాలి :
కాస్త ఎదిగిన తర్వాత పోషకాహారంవైపు పిల్లలను అడుగులేయించడంలో తల్లులు సహనం పాటించాలి. అలాకాకుండా ఆసక్తిగా తింటున్నారని ఒకే రకమైన ఆహారాన్ని రోజూ అందిస్తే పిల్లలు దానివైపు కన్నెత్తి కూడా చూడరు. కాబట్టి, వివిధ రకాల ఆహారాలను అందించాలని సూచిస్తున్నారు.
ప్రెగ్నెన్సీ తర్వాత అందం తగ్గిపోయిందా? - ఈ టిప్స్ పాటిస్తే మీ బ్యూటీని తిరిగి పొందొచ్చు!
రంగులమయంగా కనిపించాలి..
పిల్లలు కొద్దిగా ఆహారం ఎక్కువ తినాలంటే.. వారికి తినిపించే బౌల్ లేదా ప్లేటు ఆకర్షణీయంగా ఉండాలి. ప్లేటులో వివిధ రకాల పండ్ల ముక్కలను అందంగా పెట్టి తినిపించాలి. ఇలా చేయడం వల్ల వారు ఎక్కువ ఆహారం తినే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. 2009లో "ఆపెటైట్" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఒకే రంగులో ఉన్న ఆహారాల కంటే రంగురంగుల ఆహారాలను పిల్లలు ఎక్కువ తినడానికి అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పోషకాహార శాస్త్ర ప్రొఫెసర్ 'డాక్టర్ బెట్సీ ఓ బ్రైన్' పాల్గొన్నారు. రంగురంగుల ఆహారాలను పిల్లలు ఎక్కువగా తింటారని ఆమె పేర్కొన్నారు.
- చిన్నపిల్లలు ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి తల్లిపాలతోపాటు మంచి పోషకాహారం అందించడం ముఖ్యం. ఇందుకోసం బాదం, జీడిపప్పు, పుచ్చ వంటి వివిధ రకాల గింజలు, పప్పు ధాన్యాలను పొడి చేసి పాలలో కలిపి తినిపించాలి.
- అలాగే వైద్యుల సలహా మేరకు వెన్న ఎక్కువగా ఉన్న పాలు, మీగడ తీయని పెరుగుతో కలిపి అన్నం తినిపించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- పిల్లలు భోజనం చేసే రెండు గంటల సమయానికి పాలు, వేయించిన చిరుతిళ్లను తినిపించకండి. వీటివల్ల వారు పొట్ట నిండుగా ఉన్నట్లు భావించి ఆహారం తినకుండా ఉంటారు.
- ఇంట్లో తయారు చేసిన నువ్వులు, బెల్లం ఉండలు, సున్ని ఉండలు, ఉడికించిన సెనగల వంటి మొదలైన వాటిని డైలీ ఇవ్వండి.
- అలాగే ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, వివిధ రకాల డ్రైఫ్రూట్స్, పాలల్లో నానబెట్టి గ్రైండ్ చేసి మిల్క్ షేక్ లాగా తాగించండి.
- పిల్లలకు ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యం. కాబట్టి, రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే - పాలు అస్సలు తాగొద్దు!
అలర్ట్ : అమ్మాయిలూ అవాంఛిత రోమాలను షేవ్ చేస్తున్నారా? - ఈ తప్పులు చేస్తే కొత్త సమస్యలు!