Side Effects of Using Earphones : చేతిలో సెల్‌ఫోన్ ఉంటే.. చెవిలో ఇయర్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. పాటలు, సినిమా, వీడియోస్.. అంటూ ఏవేవో చూస్తూ.. చెవులను పాడుచేస్తున్నారు నేటి యువత. యువకులే కాదు.. చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరూ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. కానీ.. రాబోయే ప్రమాదాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు.
ఇయర్‌ఫోన్స్‌తో వినికిడి శక్తి కూడా బాగా తగ్గిపోతుందని, పూర్తిగా చెవుడు కూడా రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నప్పటికీ.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. తాజాగా.. ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌కు ఈ ముప్పును ఎదుర్కోవడంతో.. ఇయర్ ఫోన్స్ అంశం ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాను "సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్" అనే జబ్బుతో బాధ పడుతున్నట్టు యాగ్నిక్ తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు.. జనాలు ఇయర్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని కూడా సూచించారు.
సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ అంటే ఏమిటి? : ఇది హఠాత్తుగా వచ్చే చెవుడు. చెవిలోని హియరింగ్ నర్వ్ మీద వైరస్ దాడి చేయడంతో ఆ నర్వ్ ఉబ్బుతుంది. అయితే ఆ నర్వ్ ఒక ఇరుకైన అస్థిక ద్వారా ప్రయాణిస్తుంది కనుక ఎప్పుడైతే ఉబ్బుతుందో అప్పుడు ఒత్తిడికి లోనవుతుంది. దాంతో పనిచేసే గుణం కోల్పోతుంది. దీనివల్ల శబ్దాలు మెదడుకు చేరే వ్యవస్థ దెబ్బ తింటుంది. హఠాత్తుగా చెవుడు వస్తుంది.
అందం, ఆరోగ్యం కోసం - రాగులు తినడమే కాదు ఇలా తాగేయండి! - Finger Millets Health Benefits
ఈ సమస్యకు కారణాలు:
- పెద్ద పెద్ద శబ్దాలు వినడం, ఎక్కువ సౌండ్‌తో గంటలు గంటలు హెడ్‌ఫోన్ వాడటం వంటి మూలంగా వినికిడి లోపం వస్తుంది.
- వైరల్ ఇన్ఫెక్షన్ వల్లా రావచ్చు.
- ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కూడా రావచ్చు.
- కొన్ని రకాల మందుల వాడితే రావచ్చు. ముఖ్యంగా ఓటోటాక్సిక్ మందులు.. లోపలి చెవి, వినికిడి నరాలకు హాని కలిగిస్తాయి.
- వయసు పెరిగేకొద్దీ, లోపలి చెవిలోని జుట్టు కణాలు సహజంగా క్షీణిస్తాయి. ఇది వినికిడి లోపానికి దారితీస్తుంది.
సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ లక్షణాలు: ఈ స్థితికి ముందు ఎటువంటి లక్షణాలూ కనిపించవు. క్రమక్రమంగా ఒక్కొక్క లక్షణం కనిపిస్తాయి. ఒక చెవితో మొదలై రెండోచెవికి వ్యాధి రావచ్చు. ఒకోసారి రెండు చెవులకు ఒకేసారి రావచ్చు.
- చెవులు బరువుగా అనిపించడం
- చెవిలో నొప్పిగా ఉండటం
- కుయ్ లాంటి శబ్దం వినిపించడం లేదా సముద్రపు ఘోష చెవిలో వినిపించడం
- తక్కువ శబ్దాలను వినడంలో ఇబ్బంది
- సంభాషణలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది
- ఒక చెవితో మాత్రమే వినడం
- చెవిలో రింగింగ్ (టిన్నిటస్)
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అవకాశం ఉన్నంత వరకు హెడ్‌ఫోన్ వినియోగించకూడదు. తప్పదు అనుకుంటేనే వాడాలి. అది కూడా.. సౌండ్ 80 డెసిబుల్స్ కంటే ఎక్కువగా ఉండొద్దని ENT సర్జన్ జానకి రామిరెడ్డి వివరించారు. అది కూడా గంట కంటే ఎక్కువ సేపు వాడొద్దని సలహా ఇస్తున్నారు. కాల్ సెంటర్ వంటి ఉద్యోగాల రిత్యా రోజూ గంటలకొద్దీ హెడ్‌ఫోన్ వాడేవారు.. 8 నెలలకోసారి చెవి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కసారి చెవి లోపలి భాగం పూర్తిగా దెబ్బతింటే మాత్రం.. మళ్లీ వెనక్కి తీసుకురాలమేని హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.