Side Effects Of High Protein Diet In Telugu : డయాబెటిక్ వ్యాధిగ్రస్థులు తీసుకునే ఆహారం విషయంలో కొందరు వైద్యులు తెలిసితెలియక తప్పుడు సలహాలు ఇస్తుంటారు. మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించి కేవలం ప్రోటీన్లను మాత్రమే తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెరగకుండా చూసుకోవచ్చని సూచిస్తుంటారు. ఇందుకు అనుగుణంగా షుగర్ పేషెంట్లు కూడా వైద్యుల సూచన మేరకు ఉన్నపళంగా కార్బోహేడ్రేట్ ఆహారాన్ని మానేసి మరీ, అత్యధిక ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్‌నే తినడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలాఉంటే మన శరీరానికి రోజూ ఎంత మేర ప్రోటీన్ అవసరం అనే విషయం చాలా మందికి తెలియదు. అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి నష్టమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
మోతాదుకు మించి తీసుకుంటే ఏం జరుగుతుంది?
మన శరీరానికి ప్రోటీన్లు అనేవి అత్యవసరమైన పోషకాలు. ఇవి మన శరీరంలో కండరాలు, కణజాలాలను తయారుచేయడానికి దోహదపడతాయి. అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహారంలో ప్రోటీన్లు తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. ప్రోటీన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం ఎంత నిజమో, అదే పనిగా హై ప్రోటీన్ డైట్‌ను తీసుకోవడం కూడా అంతే ప్రమాదకరం అనే వాస్తవాన్ని తెలుసుకోండి.
రోజూ తీసుకునే ఆహారంలో అత్యధిక శాతం ప్రోటీన్ ఉన్నట్లయితే అది మన జీర్ణ వ్యవస్థపైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మన జీర్ణవ్యవస్థ అత్యధిక శాతం ప్రోటీన్‌ను జీర్ణించుకోవడంలో ఇబ్బంది పడుతుంది. ప్రోటీన్‌ను ఎక్కువగా తిన్నట్లయితే పీచు పదార్థాలను శరీరం జీర్ణింపజేసుకోలేదు. వాస్తవానికి మనం ఎంత మేర ప్రోటీన్ కంటెంట్‌ను తీసుకోవాలి అనేది మన వయస్సు, శరీర ఆకృతి, లింగం, చేసే పనులు అనే అంశాలపై ఆధారపడి ఉంటుందట.
ఇంత శాతం ప్రోటీన్ ఉండాలి!
శారీరక శ్రమ తక్కువగా చేసేవారు తీసుకునే ఆహారంలో తమ శరీర బరువులో ఒక కిలోగ్రాముకు 0.8 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు తమ శరీర బరువులో కిలోగ్రాముకు 1.2 నుంచి 1.7 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకోవచ్చు. ఇలా తమ వృత్తుల ఆధారంగా కూడా మనం తీసుకునే ప్రోటీన్ మోతాదు ఆధారపడి ఉంటుంది.
బరువు పెరుగుతారా?
ప్రోటీన్లను అధిక శాతంలో తీసుకున్నట్లయితే బరువు తగ్గుతామని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ, అది అపోహ మాత్రమే అని అంటున్నారు నిపుణులు. కార్బోహైడ్రేట్లను తగ్గించి హై ప్రోటీన్ డైట్‌ను అత్యధికంగా తీసుకోవడం ద్వారా బరువు మరింత పెరుగుతారని అంటున్నారు. ప్రోటీన్‌ను అధికంగా తీసుకుంటే అది శరీరంలో కొవ్వుగా పేరుకు పోతుందట. ఫలితంగా అది మీ శరీర బరువును అమాంతం పెంచేస్తుంది. మరోవైపు మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అత్యధికంగా ఉండే పీచు పదార్థం లేకపోతే మాత్రం మలబద్ధకం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మాంసాహార ప్రోటీన్లతో ముప్పు!
చాలామంది మాంసాహార ప్రియులు మాంసం తినడం ద్వారా అధిక ప్రోటీన్లను శరీరానికి అందించవచ్చనే కారణంతో మోతాదుకి మించి చికెన్, మటన్‌ను లాగించేస్తుంటారు. ఈ ధోరణి మీకే ముప్పుగా మారవచ్చు. మాంసంలో ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు. ఇలా ఫైబర్ శాతం లేని మాంసాహారాన్ని ఎక్కువగా తిన్నట్లయితే మీకు మలవిసర్జన అనేది ఎక్కువగా జరగదు. ఫలితంగా ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రోటీన్లను ఎక్కువగా తీసుకున్నట్లయితే కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదమూ ఉంది.
అన్నీ తింటేనే ఆరోగ్యం!
మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు సమానంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అది సమతుల ఆహారం అవుతుంది. మన శరీరానికి రోజువారీగా కావాల్సిన ప్రోటీన్లతో పాటు తగినన్ని కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ లాంటి వాటిని సమపాళ్లల్లో అందిస్తేనే ఆరోగ్యంగా ఉండగలుగుతామని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
క్యాన్సర్‌ను ఎలా గుర్తించవచ్చో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!
హార్ట్ రేట్ ఎంత ఉండాలి? ఆరోగ్యవంతుడి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది?