ICMR NIN Dietary Guidelines : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండటం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వంటి వివిధ కారణాల వల్ల నేడు ఎంతో మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే.. మనకు వచ్చే రోగాలలో దాదాపు 56 శాతం వరకు కేవలం మనం అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్లే వస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), జాతీయ పోషకాహార సంస్థ (NIN) ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి? తిండి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలపై కొన్ని సూచనలు చేశాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
సమతుల ఆహారంతోనే ఆరోగ్యం :
మనం రోజూ సమతుల ఆహారం తీసుకుంటూ, శారీరక శ్రమ చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, బిపీ, షుగర్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అయితే, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (చిప్స్, బర్గర్లు, పిజ్జా, కూల్‌డ్రింక్స్ తదితరాలు) వంటివి తినడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రొటీన్ పౌడర్ అతిగా వద్దు :
కొంతమంది సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి ప్రొటీన్ సప్లిమెంట్లు, ప్రొటీన్ పౌడర్లను వాడుతుంటారు. అయితే.. వీటిని అతిగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. 2013లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ప్రొటీన్ పౌడర్లను తరచుగా వాడే వ్యక్తులలో మూత్రపిండాల రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని బ్రిఘమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన 'డాక్టర్ జె. యున్‌కిమ్' పాల్గొన్నారు. ప్రొటీన్ పౌడర్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే వీటిని వాడటం వల్ల ఎముకల్లో మినరల్స్ తగ్గుతాయట.
బరువు పెరిగితే కష్టాలే :
మన శరీరం అనారోగ్యకరమైన బరువు పెరుగుతున్నా కొద్ది క్రమంగా శారీరక, మానసిక రుగ్మతలు పెరుగుతాయి. దీనివల్ల షుగర్, కాలేయ వ్యాధి, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యంగా ఉండటానికి ఇలా ఆహారం తినండి :
- ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తప్పక ఉండేలా చూసుకోవాలి.
- బయట మార్కెట్లో దొరికే ఫ్రూట్‌జ్యూస్‌లను తాగకుండా.. ఇంట్లోనే తాజా పండ్లు, జ్యూస్‌లను ప్రిపేర్ చేసుకోండి.
- ప్రొటీన్ సప్లిమెంట్ల బదులు ఎగ్స్, పాలు, సోయాబీన్స్, బఠానీలు తీసుకోవాలి.
- రోజుకు 25 గ్రాములు లేదా అంతకంటే తక్కువ చక్కెర తీసుకోవాలి.
- భోజనానికి ఒక గంట ముందు, గంట తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. గ్రీన్, బ్లాక్ టీ వంటివి తాగితే ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
జాతీయ పోషకాహార సంస్థ సూచించిన ముఖ్యమైన మార్గదర్శకాలు :
- ఇంట్లో వంట చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి.
- వండే ముందు ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి.
- ఆహారాన్ని బాగా ఉండికించి తీసుకోవాలి. అందులో ఎక్కువగా నూనె, తీపి, ఉప్పు లేకుండా చూసుకోవాలి.
- బరువు తగ్గాలనుకునేవారు అతిగా ఎక్కువగాసేపు వ్యాయామం చేయకూడదు. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
- వంటలలోకి అయోడైజ్‌డ్ సాల్ట్ మంచిది. అలాగే ఉప్పును మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
- రోజుకు 8 గ్లాసుల (సుమారు రెండు లీటర్లు) నీటిని తాగండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.