How To Happy In Life : నేటి ఆధునిక జీవితంలో మెజారిటీ జనాలు యంత్రాలుగా మారిపోయారు. ఏ కొద్ది మంది మాత్రమే జీవితంలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నారు. మిగిలిన వారంతా ఏదో ఒక సమస్య గురించి నిత్యం ఆలోచిస్తూ మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. ఈ ఊబిలో పడిపోయిన వారంతా.. అందులో నుంచి ఎలా బయటపడాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. ఎవరైనా తమను బయట పడేస్తే బాగుండు అని సహాయం కోసం చూస్తుంటారు. కానీ.. వారికి తెలియనిది ఏమంటే.. ఈ పరిస్థితి నుంచి ఎవరో బయట పడేయలేరు. ఎవరికి వారే ఒడ్డున పడాలి. వేరే ఆప్షనే లేదు అంటున్నారు మానసిక నిపుణులు! ఇందుకోసం కొన్ని పనులు చేయాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇతరులతో కనెక్ట్ అవ్వండి :
మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు! అలా ఉంటే పిచ్చిపిచ్చి ఆలోచనలు మనసులోకి వచ్చి.. మన సంతోషాన్ని పాడు చేస్తాయి. కాబట్టి.. ఒంటరిగా ఉండకండి. మీకు అంతగా ఏదైనా బాధ ఉంటే దాన్ని మీకు నచ్చిన వారితో, నమ్మకమైన వారితో పంచుకోండి. దీనివల్ల మనశ్శాంతిగా ఉంటుంది.
పాజిటివ్‌గా ఆలోచించండి :
మాగ్జిమమ్ ఏ ఒక్కరి జీవితం కూడా పూలపాన్పు కాదు. అలాగనీ మనం వెళ్లే మార్గంలో అన్నీ ముళ్లు కూడా ఉండవు! రెండూ ఎదురవుతాయి. వాటిని దాటుకుంటూ వెళ్లడమే జీవితం. అందుకే.. జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే అది శాశ్వతం అనుకోకండి. ఒక టైమ్ వరకే అది ఉంటుంది. దాని తర్వాత పూలబాట తప్పకుండా ఉంటుందని నమ్మండి. బాధతో కుంగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేయండి.
సోషల్ మీడియాకు దూరంగా :
నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మనం జీవితంలో ఒక భాగం అయిపోయింది. దీంతో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది! కొంత మంది.. తమకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీనికి ఫాలోవర్స్ కనెక్ట్ అవ్వడం.. వాటికి రిప్లేలు ఇవ్వడంతో మనకు తెలియకుండానే అందులో మునిగిపోతాం. చివరకు ఇదొక వ్యసనంగా మారుతుంది. మన పోస్టుకు ఎవ్వరూ స్పందించకపోతే తీవ్రంగా బాధపడిపోతాం. నిత్యం అదొక ఆందోళనగా మారుతుంది. అందుకే.. సోషల్ మీడియాను మనం వాడుకోవాలే తప్ప.. అది మనల్ని వాడుకోకూడదు.
ప్రజెంట్లో జీవించండి :
ప్రతి ఒక్కరి జీవితంలోనూ గతంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి. కొంత మంది ఆత్మీయులను కోల్పోవడం వల్ల బాధపడుతుంటే.. మరికొందరు అప్పులు, అనారోగ్యం, కోల్పోయిన ప్రేమ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అదే సమయంలో భవిష్యత్ గురించి బాధపడేవారు మరింత ఎక్కువగా ఉంటారు. రేపటి జీవితం ఏంటో.. ఎటు వెళ్తోందో అర్థం కావట్లేదని భయపడుతుంటారు. ఈ రెండింటితో భయపడుతూ, బాధపడుతూ ఉండే వారు.. ఈ నిమిషం సంతోషంగా ఎలా ఉంటారు? అందుకే.. నిన్నటిది గడిచిపోయింది.. రేపటికి రూపం లేదు. నీ ముందున్నది ఈ క్షణమే. దీన్ని అనుభవించు బ్రో!
మత్తు జోలికి వెళ్లకండి :
గతం, భవిష్యత్‌ను తలుచుకొని బాధపడేవారు, భయపడేవారు.. ప్రజెంట్లో జీవించలేరని చెప్పుకున్నాం కదా! వీరిలో కొందరు చీకటి గదిలో బతుకీడిస్తుంటే.. మెజారిటీ జనం ఎక్కడ బతికేస్తుంటారో తెలుసా? బార్ షాపుల్లో, గుట్కా వీధుల్లో, గంజాయి, డ్రగ్స్ ప్రపంచంలో విహరిస్తుంటారు. ఈ మత్తుకు బానిసలై అందులోనే సంతోషం వెతుక్కుంటూ ఉంటారు. ఆ మత్తు దిగిపోయిన తర్వాత.. మళ్లీ ఎక్కించుకుంటూ ఉంటారు. దీంతో.. ఆరోగ్యం నాశనమవుతుంది. ఆర్థికంగా దెబ్బ తింటారు. మానసికంగా మరింతగా కుంగిపోతారు. కాబట్టి.. బాధలు, భయాల పేరు చెప్పి.. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటికి అలవాటు పడకూడదు.
లైఫ్ స్టైల్ ఛేంజ్ చేసేయండి : నేనింతే సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. డైరెక్షన్ ఛాన్స్ మిస్సయిందని తీవ్ర వేదనలో ఉన్న రవితేజను మిత్రుడు ఓదార్చే ప్రయత్నం చేస్తే.. అప్పుడు ఒక మాట చెప్తాడు. "ఎప్పుడైతే ఎనర్జీ తగ్గిపోతుందో.. తిరిగి ఛార్జ్ చేసుకోవాలి" అంటూ మిట్ట మధ్యాహ్నం జాగింగ్ చేస్తాడు. తద్వారా తనలోని స్ట్రెస్, బాధను పోగొట్టుకుంటాడు. అది సినిమా అయినప్పటికీ.. ఆ విషయం వాస్తవం. అందుకే.. మీరు కూడా వ్యాయామం ద్వారా ఎనర్జీని తిరిగి పొందండి. దీనికోసం ఉదయం 5 గంటలకే నిద్ర లేవండి. గ్రౌండ్‌కు పరిగెత్తండి. చెమట చిందించి.. రీ ఫ్రెష్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. మంచి ఆహారం తీసుకోండి. కనీసం ఎనిమిది గంటల సేపు నిద్రపోండి. మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయండి.
ఇవి ఎంత చేస్తే.. అంత ఆనందం మీకు దక్కి తీరుతుంది. కావాలంటే చేసి చూడండి అంటున్నారు మానసిక నిపుణులు. మరి.. ట్రై చేస్తారా? ఇవాళ్టి నుంచే..
మీకు సంతోషం కావాలా? - అక్కడ దొరుకుతుంది - వెళ్లి తెచ్చుకోవడమే!
నిద్రకోసం "ఐ మాస్క్" ధరిస్తున్నారా! - నిపుణులు ఏమంటున్నారో తెలుసా?
కర్రీ చేసేముందు చికెన్ ముక్కలు కడగొద్దా! - కడిగితే ఏమవుతుందో మీకు తెలుసా?