Oil Skin Removing Tips in Telugu: ఎంత శుభ్రం చేసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే.. కొంత మంది ముఖం జిడ్డుగానే ఉంటుంది. మాయిశ్చరైజర్‌తోపాటు మార్కెట్లో దొరికే అనేక రకాల క్రీములు వాడినా ఫలితం ఉండదు. ఇక జిడ్డు చర్మానికి తోడు మొటిమలు, మచ్చలు ఇబ్బందిపెడుతుంటాయి. దీంతో ఏం చేయాలో తెలియక తమలో తామే బాధపడుతుంటారు. అయితే జిడ్డు సమస్యతో ఇబ్బందిపడేవారు.. ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్రీన్ టీ: గ్రీన్ టీ కేవలం ఆరోగ్యానికే కాకుండా జిడ్డును తొలగించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. 2015లో జర్నల్ ఆఫ్ కాస్మోటిక్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గ్రీన్ టీలో(National Library of Medicine రిపోర్ట్)పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. సీబమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయని.. తద్వారా జిడ్డు తగ్గుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో Seoul National University College of Medicineలో డెర్మటాలజిస్ట్ డాక్టర్ హ్యూన్ జంగ్ పాల్గొన్నారు. అంతేకాకుండా గ్రీన్ టీలో ఉండే ఇతర పోషకాలు చర్మాన్ని మృదువుగా చేసి, చర్మం వాపు తగ్గిస్తుందని, మొటిమలు తగ్గిస్తుందని పేర్కొన్నారు.
ఇవీ కూడా: గ్రీన్ టీ మాత్రమే కాకుండా పాలు కూడా జిడ్డు తొలగిస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకోసం పాలను ముఖానికి అప్లై చేసుకొని పావుగంటయ్యాక కడిగేసుకోవాలని.. ఫలితంగా చర్మంపై జిడ్డుదనం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలానే జిడ్డుకు కారణమయ్యే సీబమ్ ఉత్పత్తి కూడా అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు.
- తేనెతో కూడా ముఖంపై జిడ్డుదనాన్ని తొలగించచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం తేనెను ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
- వీటితోపాటు ముఖాన్ని శుభ్రపరుచుకునే నీళ్లలో నిమ్మరసం కలుపుకొన్నా.. నిమ్మరసంతో చేసిన ఐస్‌క్యూబ్‌తో ముఖాన్ని రుద్దుకున్నా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు నిపుణులు.
- గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం, ద్రాక్షరసం.. ఈ మూడింటినీ కొద్ది మొత్తాల్లో తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూసుకొని పావుగంట తర్వాత కడిగేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెప్పారు. నిమ్మరసం సహజసిద్ధమైన క్లెన్సర్‌గా, గుడ్డులోని తెల్లసొన చర్మం బిగుతుగా మారడానికి, ద్రాక్షరసం చర్మం మృదువుగా మారడానికి ఉపకరిస్తాయని వివరిస్తున్నారు.
- ఇవే కాకుండా కొబ్బరి పాలను ముఖానికి రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల జిడ్డుదనం తగ్గుతుందని చెబుతున్నారు.
- అయితే, సాధారణంగానే ఆయిల్ స్కిన్ ఉన్న వారు ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జిడ్డు పోతుందని భావిస్తుంటారు. కానీ, ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ముఖం కడిగే క్రమంలో పదే పదే సబ్బు లేదా ఫేస్‌వాష్ వాడితే.. అందులో ఉండే రసాయనాలు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయన్నారు. కాబట్టి సాధారణ నీటితోనే రోజుకు రెండు లేదా మూడుసార్లు ఫేస్ క్లీన్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా కూడా జిడ్డుదనం అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.
- ఇవే కాకుండా నీళ్లలో చెంచా ఉప్పు కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుని దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రోజూ ఒకటి లేదా రెండుసార్లు ఆ నీటిని ముఖం మీద స్ప్రే చేసుకుని కాసేపు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల కూడా జిడ్డుదనం క్రమంగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.