Ayurvedic Home Remedy To Cure Throat Pain in Winter : శీతాకాలంలో చాలా మంది జలుబు, దగ్గుతో పాటు గొంతు నొప్పి కూడా బాధపడుతుంటారు. వాతావరణంలోని మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు గొంతులో తిష్ట వేసుకుంటాయి. ఫలితంగా గొంతంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. దీని మూలంగా తినడం, తాగడం కష్టమవుతుంది. కొందరు లాలాజలాన్ని కూడా మింగలేకపోతారు. కొన్ని సార్లు నొప్పికి తోడు జ్వరం కూడా వస్తుంది. నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, గొంతు బొంగురు పోవడం, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభించేందుకు ఆయుర్వేద ప్రకారం ఓ ఔషధాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ. మరి దానిని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- లవంగాల చూర్ణం - 10 గ్రాములు
- తానికాయ పొడి - 10 గ్రాములు
- మిరియాల పొడి - 10 గ్రాములు
- కాచు - 30 గ్రాములు
- తుమ్మ బెరడు చూర్ణం - 30 గ్రాములు
- నీళ్లు - పావు లీటర్
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పావు లీటర్ నీళ్లు పోయాలి. ఆ తర్వాత అందులోకి తుమ్మబెరడు చూర్ణం వేసి బాగా కలిపి సిమ్‌లో పెట్టి నీళ్లు పావు వంతు అయ్యేవరకు మరిగించుకోవాలి.
- ఈలోపు మరో గిన్నెలోకి కాచు పొడి, లవంగాల చూర్ణం, మిరియాల పొడి, తానికాయ చూర్ణం వేసి బాగా కలపాలి.
- నీళ్లు బాగా మరిగి ఇంకినప్పుడు ఈ పొడులన్నీ వేసి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
- గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దికొద్దిగా తీసుకుంటూ కుంకుడు గింజ పరిమాణంలో రౌండ్‌గా చేసుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని అలానే చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుంటే గొంతు నొప్పికి ఔషధం రెడీ.
ఎలా తీసుకోవాలంటే: గొంతు నొప్పి సమస్య అధికంగా ఉన్నవారు ఈ మాత్రలను మూడు పూటలా అంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఇంకోటి, రాత్రి మరోటి తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించాలి. ఇలా గొంతు నొప్పి సమస్య తగ్గేవరకు తీసుకుంటూ ఉండాలని ప్రముఖ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు:
కాచు: ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కాచులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడతాయని.. ఇది గొంతు నొప్పికి కారణమయ్యే ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుందని అంటున్నారు. కాచు గొంతులోని అదనపు శ్లేష్మాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు
లవంగాలు: లవంగాల్లోని యూజినాల్ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుందని.. ఇది గొంతులోని బ్యాక్టీరియాను చంపి, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుందని అంటున్నారు. అలాగే గొంతులోని వాపు, మంటను తగ్గించడంలో సహాయపడుతుందని వివరిస్తున్నారు.
మిరియాలు: ఇందులోని పైపెరిన్ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుందని.. ఇది గొంతులోని వాపు, మంటను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాక్టీరియాను నాశనం చేసి ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తరుచూ గొంతు నొప్పి వస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి!