Heart Medications Ineffective India : ప్రస్తుతం మారిన జీవన పరిస్థితులతో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బారినపడే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ వ్యాధుల బారిన పడిన తర్వాత జీవింతాంతం మందులు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే.. ఈ మందుల్లో కొన్ని సరిగా పనిచేయడం లేదని పరిశోధకులు చెబుతున్నారు! జీనోమ్ ఫౌండేషన్ చేపట్టిన ఓ పరిశోధనలో ఈ కీలక విషయాలు బహిర్గతమయ్యాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు సాధారణంగా క్లోపిడొగ్రెల్, స్టాటిన్ మందులు వాడుతారు. ఇవి ప్రతి నలుగురిలోనూ ఒకరికి పనిచేయడం లేదని జీనోమ్ ఫౌండేషన్ పరిశోధనలో వెల్లడైందట. ఈ మందులను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న రోగులపై అధ్యయనం చేపట్టగా... 26% మందిలో అవి పని చేయడం లేదని తేలిందట. మరో 13% మందిలో మాత్రం అవసరానికి మించి పనిచేస్తున్నాయట. శరీరంలో జరిగే ఈ పరిణామాలను గుర్తించకుండా ఔషధాలను కొనసాగిస్తే... రెండోసారి గుండెపోటు రావచ్చని, మెదడులో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ గుండె వైద్య నిపుణులు, ఏఐజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బి.సోమరాజు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాధితులు జన్యు పరీక్ష చేయించుకుంటే.. వైద్యులు ప్రత్యామ్నాయ ఔషధాలను ఇస్తారని సలహా ఇస్తున్నారు. ఈ అధ్యయనంలో ఆయనతోపాటు జీనోమ్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ కేపీసీ గాంధీ, అపోలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, డాక్టర్ దీపిక, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కనకభూషణం, కిమ్స్ వైద్యులు డాక్టర్ శివరాజ్, డాక్టర్ కేవీజీఎస్ మూర్తి, ప్రొఫెసర్ వీఆర్‌రావు, ప్రొఫెసర్ విష్ణుప్రియ పాల్గొన్నారు.
తగ్గిన గుండెపోటు మరణాలు..
"పది నుంచి పదిహేనేళ్ల ముందు వరకు గుండెపోటు మరణాలు చాలా ఎక్కువగా జరిగేవి. కానీ.. ఇప్పుడు యాస్పిరిన్, క్లోపిడొగ్రెల్, స్టాటిన్, బీపీ, షుగర్ మందులు వచ్చాక హార్ట్ ఎటాక్స్ తగ్గిపోయాయి. అయితే.. ఈ మధ్య కాలంలో మేజర్ హార్ట్ అటాక్‌లు తగ్గి మైనర్ అటాక్స్ పెరిగాయి. గుండెపోటు వచ్చిన ఆరు గంటల వ్యవధిలో ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స తీసుకుంటే ప్రాణాలకేమీ ముప్పుండదు. ఆ తర్వాత కూడా సుమారు పది నుంచి 30 ఏళ్ల దాకా బతకొచ్చు" అని ప్రముఖ గుండె వైద్య నిపుణులు, ఏఐజీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బి.సోమరాజు వివరించారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కాలేయాన్ని ఎక్కువ దెబ్బతీసే ఆహారాలు ఇవేనట! అవేంటో మీకు తెలుసా? - Foods to Avoid Keep Liver Healthy