Health Benefits of Curry Leaves : ఇప్పటికీ చాలా మంది కరివేపాకు తినరు. కూరలో, చారులో వేసినప్పటికీ.. తినే టైమ్‌లో తీసి అవతల పారేస్తారు. కానీ.. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా నష్టమని అంటున్నారు నిపుణులు. కరివేపాకు ఆకులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుప్పెడు కరివేపాకులను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఎంతో సహాయపడతాయని అంటున్నారు. 2013లో 'జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మాకాలజీ' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. కరివేపాకు ఆకులలోని సారం జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతుందని, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్ 'డాక్టర్ శివప్రసాద్ గుర్తు' పాల్గొన్నారు. రోజూ కరివేపాకు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా? పరగడుపున ఈ 'ఐదు' ఆకులు తింటే చాలు!
బరువు తగ్గుతారు :
కరివేపాకులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో పాటు.. విటమిన్ ఎ, బి, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈ ఆకుల్లో కార్బొజోల్ ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో ఎంతో సహాయపడతాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామంతోపాటు రోజూ గుప్పెడు తాజా కరివేపాకులను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరి కొన్ని ప్రయోజనాలు :
- షుగర్ వ్యాధితో బాధపడే వారు కరివేపాకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
- ఈ ఆకులలో విటమిన్ A అధికంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది.
- కరివేపాకుల వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయట.
- ఈ ఆకులలో ఉండే కార్బొజోల్ ఆల్కలాయిడ్స్ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు యాంటీబయాటిక్, యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయని నిపుణులంటున్నారు.
- జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు రోజూవారీ ఆహారంలో కరివేపాకులను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
- డైలీ గుప్పెడు కరివేపాకులు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే అల్జీమర్స్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందని నిపుణులంటున్నారు.
- వీటిలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు చక్కటి రక్షణ కల్పిస్తాయి.
- కరివేపాకులను రోజూ తింటే బ్లడ్‌లోని కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.
- ఆడవారిలో పీరియడ్స్‌కు సంబంధించిన సమస్యలు, విరేచనాలు, గనేరియా, ఒళ్లు నొప్పులు తగ్గించడానికి కరివేపాకు బాగా పనిచేస్తుంది. ఈ ఆకుల్లో క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యాంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ముఖం తళతళ మెరిసిపోవాలా? కరివేపాకుతో ఈ ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేయండి! - Curry Leaves Benefits
పరగడుపున కరివేపాకు నీళ్లను తాగేయండి- అధిక బరువు, షుగర్ సమస్యకు చెక్!