Health Benefits of Black Cumin: ప్రతీ వంటింటి పోపుల పెట్టెలో తప్పనిసరిగా ఉండే వాటిలో జీలకర్ర ఒకటి. వంటలు చేసేటప్పుడు జీలకర్రకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాం. తాలింపులో మాత్రమే కాక వంటలు రుచిగా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తాం. అంతేకాక ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయని.. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. అయితే మామూలు జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర వల్ల కూడా పలు లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయని చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
నల్ల జీలకర్ర.. వీటినే కలోంజీ, నల్ల విత్తనాలు అంటారు. ఇవి నల్ల నువ్వులను పోలి ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కలోంజి విత్తనాలలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని.. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయని అంటున్నారు. అవేంటంటే..
జీర్ణ వ్యవస్థకు మేలు: నల్ల జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. తద్వారా అజీర్ణం, గ్యాస్, అధిక ఆమ్లత్వం, మలబద్ధకం వంటి ఇబ్బందులను అదుపు చేసి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు.
బరువు తగ్గడానికి: నల్ల జీలకర్ర మెటబాలిజం రేటును పెంచి, కొవ్వు కరిగించడంలో సహాయపడుతుందని అంటున్నారు. అలాగే ఆకలిని తగ్గించడంతో పాటు బరువుని నియంత్రిస్తాయని వివరిస్తున్నారు. అలాగే శరీరంలో తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో నల్ల జీలకర్ర ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం: కొన్ని అధ్యయనాలు నల్ల జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి. ఇది ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి.. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గిస్తాయని అంటున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ స్టడీ.. నల్ల జీలకర్రకు ఒంట్లోని చక్కెర స్థాయులు తగ్గించే గుణముందని చెబుతోంది. ఇదే విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం కూడా వివరిస్తోంది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ఇవి కూడా:
- చాలా మందికి నిద్రలేమి పెద్ద సమస్య. దీనికి చెక్ పెట్టాలంటే రాత్రి నిద్రపోవడానికి ముందు ఓ కప్పు కలోంజీ టీ తాగితే మంచిదని.. హాయిగా నిద్రపడుతుందని నిపుణులు అంటున్నారు.
- ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది ఇన్ఫెక్షన్ల బారినపడుతున్నారు. ఇలాంటి వారు నల్ల జీలకర్రను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
- నల్ల జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, ఖనిజ లవణాలు... హానికారక ఫ్రీరాడికల్స్ ఉత్పత్తిని తగ్గించి క్యాన్సర్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందడాన్ని అడ్డుకుంటాయని చెబుతున్నారు.
- కలోంజీలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు. విష వ్యర్థాలను బయటకు పంపించి మెటబాలిజం రేటుని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కాలేయ వాపును తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు.
- ప్రస్తుతం చాలా మంది తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు కలోంజి విత్తనాలను ఉపయోగించి ఇంట్లోనే రకరకాల హెయిర్ డైలు తయారు చేసుకుని వాడితే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రైకాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కలోంజి విత్తనాలు తెల్లజుట్టును నల్లగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడతాయని కనుగొన్నారు.
ఎలా తీసుకోవాలంటే: ఓ గిన్నెలో చెంచా గింజలు, మూడు కప్పుల మంచి నీరు పోసి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు అయ్యే వరకూ మరిగించండి. ఆపై వడకట్టి కాస్త తేనె చేర్చి.. తాగితే సరి.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఆ ఫుడ్ తింటే పెద్దపేగు క్యాన్సర్ వస్తుందట జాగ్రత్త! ఈ డైట్ పాటిస్తే సేఫ్!
షుగర్ బాధితులకు దాల్చిన చెక్క మందు! - పరిశోధనలో కీలక విషయాలు