Dark Chocolate and Diabetes : మనలో చాలా మందికి చాక్లెట్లంటే ఎంతో ఇష్టం. మార్కెట్లో చాలా రకాల చాక్లెట్లున్నాయి. అయితే, ఈ చాక్లెట్లలో డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. వీటిని కోకో గింజల నుంచి తయారు చేస్తారు. వీటిని తినడం వల్ల టైప్ 2 మధుమేహం ముప్పు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, వారానికి ఐదు సార్లు డార్క్ చాక్లెట్ తింటే టైప్ 2 మధుమేహం (డయాబెటిస్) ముప్పు 21 శాతం తగ్గే అవకాశం ఉందని అమెరికాలో జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైందట. ఈ పరిశోధన 'బ్రిటిష్ మెడికల్ జర్నల్'(British Medical Journal)లో ప్రచురితమైంది. అయితే.. పాలతో తయారు చేసిన చాక్లెట్లు తినడం వల్ల ఇటువంటి ప్రయోజనాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.
డార్క్ చాక్లెట్లో ఫ్లేవనోల్స్ అనే సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. అలాగే టైప్ 2 డయాబెటిస్ ముప్పును తగ్గించడానికీ సహాయపడతాయని గతంలోనూ పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు.. అమెరికాలో జరిగిన మూడు పరిశోధనల డేటాను కలిపి విశ్లేషించారట. రీసెర్చ్‌లో డయాబెటిస్, గుండె జబ్బులు లేదా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు లేని వారి ఆహారపు అలవాట్లను పరిశీలించారట.
డార్క్, మిల్క్ చాక్లెట్ల మధ్య తేడా..
డార్క్ చాక్లెట్లో ఉండే కోకో, పాలు, చక్కెరల నిష్పత్తి.. పాలతో చేసిన చాక్లెట్‌లో ఉండే వాటి కంటే భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఈ రెండు రకాల చాక్లెట్లు డయాబెటిస్ ముప్పుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి ఈ పరిశోధన చేపట్టామని నిపుణులు తెలిపారు.
డార్క్ చాక్లెట్ ఎక్కువగా తీసుకోవడం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. పాలతో చేసిన చాక్లెట్ ఎక్కువగా తీసుకోవడం అధిక బరువుకు దారి తీస్తుందని కనుగొన్నారు. అయితే, ఈ ఫలితాలను ధృవీకరించడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పచ్చి బొప్పాయి తింటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట - వెల్లడించిన పరిశోధన!
టాన్సిల్స్ సమస్యతో ఏం తినలేకపోతున్నారా? ఇది తాగితే మీ గొంతు నొప్పి పక్కా మాయం!