Best Tips To Stop Burping : కడుపు నిండా ఆహారం తిన్నాక చాలా మంది బ్రేవ్ బ్రేవ్ మంటూ తేన్పుతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. సాధారణంగా నోటితో గాలిని పీల్చుకోవటం, ఆహారం జీర్ణమయ్యే సందర్భాల్లో కడుపులో గ్యాస్ పేరుకుపోతుంటుంది. ఇది బయటకు రావటానికి ప్రయత్నించటం వల్లే తేన్పులు వస్తుంటాయి. కానీ, కొన్నిసార్లు ఈ గ్యాస్ జీర్ణాశయం, పేగుల్లోనే ఉండిపోయి కడుపు ఉబ్బరం, ఎసిడిటీ(Acidity), నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది. మీరూ ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? అయితే, కొన్ని నేచురల్ హోమ్ రెమిడీస్ ఫాలో అవ్వడం ద్వారా తేన్పుల సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అల్లం ముక్కలు : జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా భోజనం తర్వాత అజీర్తి, తేన్పుల సమస్య వేధిస్తుంటే రోజుకు రెండు లేదా మూడుసార్లు చిన్న అల్లం ముక్కలను తీసుకోవడం ద్వారా మంచి రిలీఫ్ లభిస్తుందంటున్నారు. ఎందుకంటే.. అల్లంలో శరీరంలోని విషవాయువులను పోగొట్టే ఔషధ గుణాలు ఉండడమే ఇందుకు కారణమంటున్నారు. అలాగే.. అల్లాన్ని నేరుగా తినడానికి ఇబ్బంది పడేవారు తేనెతో కలిపి తీసుకోవచ్చంటున్నారు.
2012లో 'Evidence-Based Complementary and Alternative Medicine' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అల్లం తేన్పులు, దాని వల్ల కలిగే కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. ఈ పరిశోధనలో డాక్టర్ గులాం అహ్మద్ పాల్గొన్నారు. అల్లాన్ని తీసుకోవడం వల్ల అందులో ఉండే ఔషధ గుణాలు తేన్పులు, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
గబగబా తినేస్తున్నారా? ఎసిడిటీ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త!
అల్లం నిమ్మరసం వాటర్ : తేన్పుల సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లయితే.. అల్లాన్ని ఇలా తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటంటే.. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఓ గ్లాస్ నీరు పోసి స్టవ్ మీద పెట్టి పది నిమిషాలు మరిగించుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకొని గోరువెచ్చగా మారాక అందులో కొంచెం నిమ్మరసం లేదా తేనెను కలుపుకొని తాగాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేస్తే తేన్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చని చెబుతున్నారు.
సోంపు గింజలు : చాలా మందికి అన్నం తిన్నాక సోంపు గింజలను తీసుకునే అలవాటు ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా, ఈజీగా జీర్ణమవుతుందనే విషయం చాలా మందికి తెలిసిందే. అయితే, సోంపు గింజలు తేన్పుల సమస్యను తగ్గించడంలో కూడా చాలా ఫెక్టివ్గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ గింజల్లో శరీరం నుంచి విషవాయువులను పోగొట్టే లక్షణాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. కాబట్టి, భోజనం తర్వాత గ్యాస్ ట్రబుల్, పుల్లటి తేన్పులు వస్తుంటే.. సోంపు గింజలు నమలడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
సెలెరీ వాటర్ : మీరు తేన్పులు, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లయితే సెలెరీ వాటర్ తీసుకోవడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా ఓ టేబుల్ స్పూన్ సెలెరీ(కొత్తిమీరను పోలిన మొక్క) ఆకులను ఒక గ్లాస్ వాటర్‌లో వేసి మరిగించుకోవాలి. ఆపై వాటిని కాస్త చల్లార్చుకొని తాగాలి. ఫలితంగా ఈ సమస్య నుంచి తక్షణమే మంచి రిలీఫ్ లభిస్తుందంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.