Manamey Movie Review;
చిత్రం: మనమే;
నటీనటులు: శర్వానంద్, కృతిశెట్టి, సీరత్‌కపూర్, విక్రమ్ ఆదిత్య, వెన్నెల కిషోర్, ఆయేషా ఖాన్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్,
శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు;
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్;
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వి.ఎస్. విష్ణు శర్మ;
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి;
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్;
రచన, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య;
ఈ వారం బాక్సాఫీస్ బరిలో దిగిన చిత్రాల్లో మనమే ఒకటి. ఒకే ఒక జీవితం తర్వాత శర్వానంద్ నుంచి వచ్చిన చిత్రమిది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఇంతకీ ఈ మనమే సినిమా ఎలా ఉందంటే?
కథేంటంటే ? - లండన్‌లో మాస్టర్స్ పూర్తి చేసి జల్సాగా గడిపే విక్రమ్ (శర్వానంద్) అనాథైన తన మిత్రుడు అనురాగ్ (త్రిగుణ్)తో చిన్నప్పటి నుంచి కలిసి ఉంటాడు. అతడిని అన్నీ తానై చూసుకుంటాడు. అతడి ప్రేమ పెళ్లిని కూడా దగ్గరుండి మరీ జరిపిస్తాడు. కానీ అనురాగ్ ఫ్యామిలీ భారత్‌కు వెళ్లి ఓ అనుకోని ప్రమాదంలో చనిపోతుంది. ఈ ప్రమాదంలో బతికిన వారిద్దరి కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) సంరక్షణ బాధ్యతను సుభద్ర (కృతి శెట్టి)తో కలిసి విక్రమ్ తీసుకుంటాడు. అలా వారిద్దరూ పెళ్లి కాకుండానే ఖుషి కోసం తల్లిదండ్రులగా మారుతారు. మరి ఆ పిల్లాడిని పెంచే విషయంలో విక్రమ్, సుభద్రలకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగాయి? ఇలా పలు అంశాలతో కథ నడిచింది.
ఎలా సాగిందంటే - వినోదంతో పాటు బలమైన భావోద్వేగాల్ని మేళవించి తెరకెక్కించాడు దర్శకుడు శ్రీరామ్. ఫస్ట్ హాఫ్ అంతా ఓ ఫన్ రైడ్‌లా సరదా సరదాగా సాగుతుంది. సెకండాఫ్ ఎమోషన్స్‌తో బరువెక్కించాడు. సరిగ్గా శర్వాకు మాత్రమే సరిగ్గా సరిపోయే కథలా అనిపించింది. ప్లేబాయ్‌లా శర్వా చేసే అల్లరి అందరికీ నచ్చుతుంది. ఈ మధ్యలో వచ్చే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ బాగా నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్‌లో పేరెంట్స్ ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ బాగా ఆలోచింపజేస్తుంది. ఎలాంటి యాక్షన్ హంగామా లేకుండా కథను ఆహ్లాదకరంగా ముగించిన తీరు బాగుంది.
ఎవరెలా చేశారంటే : విక్రమ్ పాత్రలో శర్వానంద్ చాలా ఎనర్జిటిక్‌గా, అందంగా కనిపించాడు. తన హుషారైన నటనతో ప్రేక్షకుల్ని నవ్వించడంతో పాటు భావోద్వేగభరితమైన నటనతో మదిని బరువెక్కించాడు. విక్రమ్ ఆదిత్య నటన ముద్దొచ్చేలా ఉంది. ఆ పిల్లాడితో శర్వా చేసే అల్లరే సినిమాకి హైలైట్. సుభద్రగా కృతి ఎంతో అందంగా కనిపించడంతో పాటు పరిణతితో కూడిన నటనతో కట్టిపడేసింది. ప్రతినాయకుడిగా రాహుల్ రవీంద్రన్ పాత్ర అంత బలంగా లేదు. సీరత్ కపూర్, ఆయేషా అతిథి పాత్రల్లో మెరిశారు. వెన్నెల కిషోర్ కనిపించే రెండు మూడు సీన్లు బాగా వర్కవుటయ్యాయి. రాహుల్ రామకృష్ణ పాత్రను పెద్దగా వాడుకోలేకపోయారు. దర్శకుడు శ్రీరామ్ రాసుకున్న కథ, దాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. హిషమ్ సంగీతం మరో ఆకర్షణ. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చివరిగా: మనమే ఓ వినోదభరిత ప్రయాణం
అకీర విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్! - Akira Nandan Tollywood Entry