Rashmika Deep Fake Video : సినీనటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో కీలక నిందితుడిని దిల్లీ పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. రష్మిక వీడియోలు సృష్టించినట్టు నిందితుడిపై అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. గతేడాది నవంబరు 10న డీప్ ఫేక్ వీడియో ఘటనపై దిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు లభించినట్లు ఇటీవలే పోలీసులు వెల్లడించారు.
సాంకేతిక విశ్లేషణతో వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పిన పోలీసులు ఏయే ఐపీ అడ్రస్‌ల నుంచి వీడియో అప్‌లోడ్ అయిందో గుర్తిస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే వీడియో సృష్టించిన ఓ దక్షిణాది వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కీలక నిందితుడు ఈమని నవీన్ (24)ను ఏపీలోని గుంటూరులో అరెస్టు చేశామని తెలిపారు. అతడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక నిందితుడు డిలీట్ చేసిన డేటాను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్ పేజీ నడిపిన నిండితుడు, మరో ఇద్దరు ప్రముఖుల పేరుతోనూ ఫ్యాన్ పేజీలు మెయిన్టేయిన్ చేశాడని, అంతే కాకుండా ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకే డీప్ ఫేక్ వీడియో సృష్టించినట్లు విచారణలో తేలింది.
అసలేం జరిగింది ?
Rashmika Deep Fake Video Issue : సోషల్ మీడియా తార జరాపటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి కొందరు దుండగులు డీప్‌ఫేక్ వీడియోను తయారుచేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అశ్లీలంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యి పలువురు ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు మద్దతు తెలిపారు. నిండితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై స్పందించిన రష్మిక టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ ఆవేదన చెందారు. మరోవైపు ఈ వ్యవహారంపై దిల్లీ మహిళా కమిషన్ ఆ ప్రాంత పోలీసులులకు నోటీసులు పంపింది.