Darling Movie Nabha Natesh : 'నన్ను దోచుకుందువటే', చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది నభా నటేశ్. 'ఇస్మార్ట్ శంకర్'తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత రెండేళ్లు పాటు ఎవరికి కనిపించలేదు. అందుకు కారణం ప్రమాదంలో భుజానికి గాయమవడం వల్ల కొంతకాలం విరామం తీసుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు 'డార్లింగ్' చిత్రంతో ప్రియదర్శితో కలిసి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అశ్విన్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్లో బాగా బిజీగా ఉన్నారు. ప్రచారంలో భాగంగా హీరో- హీరోయిన్లు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'చిన్న హీరోలతో కలిసి నటిస్తే అగ్ర నటుల సినిమాల్లో ఛాన్స్‌లు వస్తాయా?' అని యాంకర్ అడగ్గా నభా ఈ విధంగా స్పందించారు. 'ఈ ప్రశ్న నాకెప్పుడు ఎదురైనా దీనికి సమాధానం ఇవ్వలా? వద్దా అని ఆలోచిస్తా. కమర్షియల్ సినిమాకు ప్రస్తుతం అర్థం మారిపోయింది. ఈ రోజుల్లో కంటెంటే ఓ స్టార్. ఓ ప్రేక్షకురాలిగానే చెబుతున్నా. నేను సినిమాలు చూస్తూ పెరిగా. ఓ ఆడియన్‌గా ఆసక్తి రేకెత్తించేలా కథలనే ఎంపిక చేసుకుంటా. ఆయా స్టోరీలు, పాత్రలకు న్యాయం చేసేందుకు తగిన కృషి చేస్తా' అని తెలిపారు.
'నేనే నటిస్తా అని అడిగా'
ముందుగా ఈ సినిమాని సందీప్ కిషన్‌తో తీయాలనుకున్నారట? అనే ప్రస్తావనరాగా ప్రియదర్శి సమాధానమిచ్చారు. " 'ఏ1 ఎక్స్‌ప్రెస్' (సందీప్ కిషన్ హీరో) సినిమా చిత్రీకరణ సమయమది. ఆ చిత్రంతోనే అశ్విన్ నాకు పరిచమయ్యాడు. అప్పట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లులో నటించేవాడిని. అశ్విన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసేవాడు. అశ్విన్ రాసిన కథ గురించి తెలిసిన క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ మంచి కథ విన్నానని నాతో చెప్పాడు. సందీప్ కిషన్ నటిస్తాడేమో అని అనుకున్నా. అతడు వేరే ప్రాజెక్టులతో బిజిగా ఉన్నాడని తెలిసి తర్వాత కథ విన్నా. స్క్రిప్టు చదవగానే ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయా. కొద్ది కాలం గడిచిన తర్వాత నువ్వు ఎవరితోనూ ఇంకా ఈ సినిమాని ప్రారంభించకపోయి ఉంటే నేను నటిస్తా అని అశ్విన్‌ను అడిగా " అని ప్రియదర్శి వెల్లడించారు.
నార్త్‌లో ప్రభాస్ మార్క్ - రూ.250 కోట్ల మార్క్‌కు చేరువలో 'కల్కి'