Pushpa 2 Collections : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయ్యారు. అయితే హైకోర్టు విచారణ అనంతరం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్, పుష్ప 2 కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందా? శుక్రవారం వసూళ్లు ఎలా ఉన్నాయనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం.
9 రోజుల్లో ఎంతంటే? - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2' రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించింది. ప్రస్తుతం రూ.1000కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. చిత్రం విడుదలై పది రోజులు అవుతున్నా జోరు చూపిస్తూ ముందుకెళ్తోంది.
తాజాగా 'పుష్ప 2' శుక్రవారం 9వ రోజు కూడా మంచి వసూళ్లనే అందుకుంది. అన్ని భాషల్లో కలిపి రూ.36.25 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. శుక్రవారం తెలుగులో రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, హిందీలో రూ. 27 కోట్లు, తమిళంలో రూ.1.3 కోట్లు, కర్ణాటక , కేరళ రూ.2 లక్షల వరకు వచ్చాయట. మొత్తంగా ఇండియాలో రూ.36.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందట. దీంతో ఇండియాలో మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.725.8 కోట్లు రాగా మొత్తంగా 9 రోజులు పూర్తయ్యేసరికి రూ. 761.1కోట్లు వచ్చినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ రూ.1067 కోట్లు వచ్చినట్లు సమాచారం.
అంతేకాకుండా, 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా 'పుష్ప 2 ది రూల్' చరిత్ర సృష్టించింది. ఇకపోతే వీకెండ్ వచ్చిన నేపథ్యంలో శని, ఆదివారాలు ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు.
గమనిక : పైన చెప్పిన వసూళ్లు అధికారిక లెక్కలు కాదు. ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు, ట్రేడ్ విశ్లేషకుల ట్వీట్లు ఆధారంగా రాసినవి.
కాగా, 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్‌కు సీక్వెల్‌గా పుష్ప 2 రూపుదిద్దుకుంది. రష్మిక హీరోయిన్గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దీనిని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్‌లో ఆయన ప్రదర్శన అదరహో అంటున్నారు.
'ఇది మనందరి తప్పు' - అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన హీరో నాని