Wholesale Inflation Rises : ఆహార పదార్థాలు, కూరగాయలు, తయారీ వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.61 శాతానికి పెరిగింది. వాస్తవానికి వరుసగా గత మూడు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. అంతకు ముందు నెలలో టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం 1.26 శాతంగా ఉంది.
"2024 మే నెలలో ఆహార వస్తువులు, ఆహార ఉత్పత్తుల తయారీ, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజ నూనెలు మొదలైన వాటి ధరలు బాగా పెరిగాయి. ఫలితంగా టోకు ద్రవ్యోల్బం 2.61 శాతానికి పెరిగింది."
- కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
డేటా ప్రకారం,
- ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం మే నెలలో 9.82 శాతం పెరిగింది. ఏప్రిల్ నెలలో ఇది 7.74 శాతంగా ఉంది.
- కూరగాయల ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 23.60 శాతం ఉండగా, మే నెలలో అది 32.42 శాతానికి పెరిగింది.
- మే నెలలో ఉల్లి ద్రవ్యోల్బణం 58.05 శాతంగా ఉంది.
- మేలో బంగాళాదుంప ద్రవ్యోల్బణం 64.05 శాతంగా ఉంది.
- మేలో పప్పు దినుసుల ద్రవ్యోల్బణంగా 21.95 శాతం మేర పెరిగింది.
- ఇంధనం, శక్తి (పవర్) ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 1.38 శాతంగా ఉంటే, మే నెలలో స్వల్పంగా తగ్గి 1.35 శాతానికి చేరింది.
- తయారు చేసిన ఉత్పత్తుల (మాన్యుఫాక్చర్డ్ ప్రొడక్ట్స్) ద్రవ్యోల్బణం ఏప్రిల్లో (-) 0.42 శాతం ఉండగా, అది మే నెలలో 0.78 శాతానికి పెరిగింది.
రిటైల్ ద్రవ్యోల్బణం
మే నెలలోని టోకు ద్రవ్యోల్బణం పెరగగా, రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం తగ్గింది. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది కనిష్ఠ స్థాయి 4.75 శాతానికి తగ్గింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆర్బీఐ ద్రవ్యవిధానాన్ని రూపొందించేటప్పుడు ప్రధానంగా ఈ రిటైల్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకుంటుంది.
కీలక వడ్డీ రేట్లు యథాతథం
ఆర్బీఐ ఈ సారి కూడా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్లను సైతం 6.75 శాతం వద్ద స్థిరంగానే ఉంచింది. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, అంతర్జాతీయంగానూ ప్రతికూలతలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక వృద్ధి బాగానే ఉన్నప్పటికీ
భారతదేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా అనేక ప్రతికూల అంశాల ప్రభావం మనపై పడుతోంది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్తున్నాయి. మరో వైపు దేశీయ ద్రవ్యోల్బణం కూడా క్రమంగా పెరుగుతోంది. పైగా అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం జరిగింది.
గుడ్ న్యూస్ - తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today