Tips To Avoid Cyber Attacks : డిజిటల్ ప్రపంచంలో ధీమాగా మీ డిజిటల్ పేమెంట్స్‌ను చేయలేకపోతున్నారా? ఏదైనా అనుమానపు లింక్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే సైబర్ కేటుగాళ్లు మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బును కాజేస్తారేమోనని భయం వేస్తోందా? అయితే వెంటనే ఈ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. దీంతో మీరు కోల్పోయిన సొమ్ము మొత్తంతో పాటు, అదనంగా అయ్యే ఖర్చులను కూడా చెల్లిస్తుంది బీమా సంస్థ. అంతేకాకుండా ఈ సైబర్ బీమా వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఏంటీ సైబర్ ఇన్సూరెన్స్?
What Is Cyber Insurance Policy : నేడు మన ఆర్థిక నిర్వహణ అంతా ఆన్లైన్లోనే చక్కబెట్టేస్తున్నాం. వస్తువులను కూడా ఆన్లైన్లో కొనేస్తున్నాం. వాస్తవానికి ఈ డిజిటలైజేషన్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్న ఘటనలు కూడా నేడు బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మీ డిజిటల్ ఆస్తులకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఉపయోగపడేదే 'సైబర్ బీమా పాలసీ'. ఇప్పుడిది తప్పనిసరి అవసరంగానూ మారింది. ఇది మనం నష్టపోయిన నగదును, అలాగే అందుకైన అదనపు ఖర్చులను తిరిగి పొందడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అనేక బీమా కంపెనీలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎటువంటి భయం లేకుండా మీ డిజిటల్ కార్యాకలాపాలను సురక్షితంగా పూర్తి చేసుకోవచ్చు.
ఆర్థిక భద్రతను కల్పిస్తుంది
సైబర్ దాడుల వల్ల వ్యక్తులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఖాతా నుంచి అపహరణకు గురైన డబ్బులను, దానికి సంబంధించిన సమాచారాన్ని తిరిగి పొందేందుకు పెట్టిన ఖర్చులను సైబర్ బీమా ద్వారా పొందవచ్చు.
గుర్తింపు దొంగతనం
సైబర్ నేరగాళ్లు ఆధార్, పాన్ లాంటి వ్యక్తిగత వివరాలను దొంగిలించి, వాటి ద్వారా రుణాలు తీసుకోవడంలాంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్నీ సైబర్ బీమా భర్తీ చేస్తుంది.
గ్యాడ్జెట్స్‌కు నష్టం
మాల్‌వేర్, ఫిషింగ్ లాంటి ప్రమాదకర దాడుల వల్ల మన డిజిటల్ ఉపకరణాలైన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనూ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది.
ఎమోషనల్ సపోర్ట్
సైబర్ దాడులు కేవలం డబ్బుకు సంబంధించిన విషయమే కాదు. కొన్నిసార్లు వ్యక్తుల భావోద్వేగాలపై కూడా ఇవి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి బారిన పడిప్పుడు చాలామంది తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. తరువాత డిప్రెషన్లోకి వెళతారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కౌన్సిలింగ్ పొందేందుకు బీమా సంస్థలు సహాయం చేస్తాయి.
మీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగితే?
సోషల్ మీడియాలో మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు సైబర్ ఇన్సూరెన్స్ మీకు తోడుగా నిలుస్తుంది. సదరు సైట్ లేదా సంస్థపై మీరు చట్టపరంగా తీసుకునే చర్యలకు అవసరమైన ఆర్థిక చేయుతను అందిస్తుంది.
చివరగా సైబర్ పాలసీని కేవలం ప్రీమియం చెల్లించి, తీసుకునే ఒక సాధనంగా చూడకండి. నేటి డిజిటల్ ప్రపంచంలో అది మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తూ, రక్షణ కవచంలా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.
సేవింగ్స్ అకౌంట్ ఉంటే రోజుకు రూ.500- ఎందుకోసమో తెలుసా?
'త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్'- WEF ప్రెసిడెంట్