Switching Car Insurance Company : కారు కొనేవాళ్లు ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా, వాహనం పాడైపోయినా, మనల్ని ఆర్థిక భారం నుంచి గట్టెంకించేది ఈ ఇన్సూరెన్సే. అయితే కొన్ని సందర్బాల్లో మనం తీసుకున్న పాలసీలు మనకు నచ్చకపోవచ్చు. లేదా వాటికంటే వేరే చోట అదనపు బెనిఫిట్స్ ఇస్తుండవచ్చు. అలాంటి సందర్భంలో మన కారు ఇన్సూరెన్స్‌ను మరో బెస్ట్ కంపెనీకి మార్చాలని ఆలోచిస్తుంటాం. అది ఎలా మార్చుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటాం. అయితే కొత్త కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసుకునే సమయంలో మార్చుకోవటమే ఉత్తమం. అంతేకాదు, మీరు కార్ ఇన్సూరెన్స్ మార్చే సమయంలో కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా గమనించాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రీసెర్చ్ చేయాలి
సాధారణంగా కార్ ఇన్సూరెన్స్‌ను ఏడాదికి ఒకసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కార్ పాలసీలపై అదనంగా ఆరు నెలలపాటు బీమా సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఈ ఫెసిలిటీని మీరు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మీరు తీసుకున్న పాలసీ కంటే, అదనపు బెనిఫిట్స్ కల్పించే పాలసీలు ఏమున్నాయో ఆన్లైన్లో సెర్చ్ చేయాలి. అలాగే మార్కెట్లోని వివిధ పాలసీలను తప్పనిసరిగా సరిపోల్చుకోవాలి. వాటిలో బెస్ట్ పాలసీని ఎంచుకోవాలి.
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో
మీరు కార్ పాలసీ తీసుకునే ముందు తప్పనిసరిగా ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని పాలసీలు తక్కువ ధరకే మీకు లభించినా, దాని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో సరిగ్గా లేకపోతే, చెల్లింపుల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ సకాలంలో క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తోందా? లేదా? అనేది చూసుకోవాలి.
పాలసీల్లో గ్యాప్ రానీయవద్దు
- మీరు కొత్త పాలసీని ఎంచుకున్న తర్వాత, మీ పాత పాలసీని రద్దు చేయమని సదరు కంపెనీకి రాత పూర్వకంగా సమాచారం ఇవ్వాలి. దీని ద్వారా మీ పాలసీ రెన్యువల్ ఆగిపోతుంది.
- మీ ప్రస్తుత పాలసీ ముగియడానికి కనీసం ఒక రోజు ముందే కొత్త పాలసీ అమలయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే, ఇన్సూరెన్స్ పాలసీలో ఒక్క రోజు గ్యాప్ వచ్చినా, మీ కొత్త బీమా పాలసీ ప్రీమియం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల పాత పాలసీ టెర్మినేట్ అవ్వకముందే, కొత్త పాలసీని తీసుకోవడం చాలా మంచిది.
- కొత్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వెంటనే, సదరు ఇన్సూరెన్స్ కార్డును మీ దగ్గర ఉంచుకోండి. అయితే, దానితో పాటు పాత పాలసీ పత్రాలను కూడా మీ దగ్గర ఉంచుకోవడం మంచిది.
- ఈ రోజుల్లో చాలా వరకు నకిలీ బీమా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అవి మార్కెట్లో మంచి పేరున్న ఇన్సూరెన్స్ కంపెనీల పేరు చెప్పి, నకిలీ ఏజెంట్ల ద్వారా కస్టమర్లను మోసగిస్తున్నాయి. కనుక ఇలాంటి వాటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఇవండీ మీ వెహికల్ ఇన్సూరెన్స్ మార్చే ముందు గమనించాల్సిన అంశాలు. వీటిని పాటించి మీకు నచ్చిన వాహన ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి.