IndiGo New Flights : దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ 'ఇండిగో' ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఏడు కొత్త అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ఇండిగో 18వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాన్ని కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు.
12 మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు
ఈ ఏడాది నవంబరు రెండో వారం నాటికి ఇండిగో కంపెనీ మన దేశంలోని 12 మార్గాల్లో నడిచే విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానుంది. దేశ రాజధాని దిల్లీ నుంచి ఎంపిక చేసిన మార్గంలో నడిచే విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయి. ఈ సీట్ల బుకింగ్స్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయని కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు. 'ఇండిగో బ్లూ చిప్' పేరుతో కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాంను ఇండిగో లాంఛ్ చేయనుంది. వచ్చే ఏడాది మార్చి 31లోగా కొత్త అంతర్జాతీయ మార్గాల్లో ఇండిగో విమాన సర్వీసులు మొదలవుతాయని పీటర్ ఎల్బర్స్ తెలిపారు. మరో ఏడు కొత్త మార్గాల్లో సర్వీసులు మొదలైతే, ఇండిగోకు చెందిన ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్న రూట్ల సంఖ్య 40 దాటుతుంది.
ప్రస్తుతం 33 విదేశీ నగరాలకు ప్రతిరోజూ 2వేలకు పైగా ఇండిగో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికులను 120 గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కొత్తగా అందుబాటులోకి రానున్న విదేశీ మార్గాల్లో శ్రీలంకలోని జాఫ్నా కూడా ఉంది. దేశీయ విమానయాన సర్వీసులలో ఇండిగో మార్కెట్ వాటా 61 శాతంగా ఉంది. ప్రస్తుతానికి టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారాకు చెందిన విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. జూన్ నెలాఖరు నాటికి ఇండిగో కంపెనీ వద్ద దేశీయ విమానయాన సేవల కోసం 382 విమానాలు ఉన్నాయి. వీటిలో 18 విమానాలు లీజుపై తీసుకున్నవి. ఇండిగో కంపెనీ వచ్చే ఏడాది A321 XLR విమానాలను, 2027 నాటికి A350 విమానాలను అందుకోనుంది.