How To Manage Your Savings Account : సంపాదన ఎంత ఉన్నా, దాన్ని సరిగ్గా వినియోగించుకోకుంటే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. మీకు వచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా, మిగిలిన వాటిలో కొంచమైన పొదుపు చేయాలి. అప్పుడే జీవితంలో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రారంభ దశ నుంచే పొదుపు చేయడం చాలా అవసరం. వాస్తవానికి మన ఆర్థిక ప్రయాణం మొదలయ్యేది పొదుపు ఖాతాతోనే. అందుకు ఎన్నో బ్యాంకులున్నప్పటికీ ఒకటి, రెండు బ్యాంకులతోనే మన పొదుపు ఖాతాలతో మన బంధం కొనసాగుతుంది. అందువల్ల పొదుపు విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అన్ని అవసరాలకూ ఒకే ఖాతానా
చాలా మంది చేసే తప్పు అన్నీ అవసరాలకు ఒకే ఖాతాను వాడటం. కానీ ఆ తప్పు ఇక నుంచి చేయద్దు. బ్యాంకు ఖాతాలు మీ ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి, అత్యవసర నిధిని దాచుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే వేతనాల నుంచి ప్రభుత్వ పథకాల వరకూ అన్నీ ఒకే ఖాతాలోకి వచ్చేలా వాడుతుంటారు. కానీ ఇలా చేయకూడదు. పొదుపు ఖాతాను తెరవడం వల్ల పని అయిపోదు. దాన్ని నిర్వహించడంలోనూ మెలకువలను నేర్చుకోవాలి. భవిష్యత్తులో మీరు ఏ రుణం తీసుకోవాలన్నా, మొదటిగా మీ పొదుపు ఖాతానే పరిశీలిస్తారన్న సంగతి మర్చిపోవద్దు.
2. ఖర్చుల కోసం వేరే ఖాతాలు
వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చులు ఒకే ఖాతా నుంచి చేస్తే పొదుపు చేయడం కష్టం అవుతుంది. వేతనం లేదా పొదుపు ఖాతా నుంచి ఖర్చులు చేయడం మానుకోవడం మంచిది. చిన్న చిన్న ఖర్చులకు ప్రత్యేకంగా వేరే ఖాతాను తెరచి దాని నుంచి చెల్లింపులు చేయడం అలవాటు చేసుకోండి. నెలకు ఒకసారి అందులో నిర్ణీత మొత్తం జమ చేసుకోండి. డిజిటల్ చెల్లింపులకు ఈ ఖాతానే జోడించుకుంటే మీ ఖర్చులు ఎంత అవుతున్నాయనేదీ తెలుసుకునేందుకు వీలవుతుంది.
3. అధిక వడ్డీ శాతం
పొదుపు చేయడానికి ముందు సరైన బ్యాంకును ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ఏ బ్యాంకులు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తునాయో కొంచెం అవగాహన పెంచుకోండి. వడ్డీ రేట్లు, ఖాతాలో కనీస నిల్వ నిర్వహణ, ఏటీఎం ఛార్జీలు ఇలా అన్ని వివరాలూ తెలుసుకోవాలి. కొత్తతరం బ్యాంకులు రూ.2 లక్షలకు పైన నిల్వ ఉన్న పొదుపు ఖాతాపై దాదాపు 7 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఒకవేళ పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకపోతే దానిపై విధించే రుసుములనూ తెలుసుకోవాలి.
4. మదుపరులకు
అదనపు ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టేవారు మరో ప్రత్యేక ఖాతాను తెరవండి. ఇందులో నుంచే మీ మొత్తం పెట్టుబడుల లావాదేవీలు జరిగేలా చూసుకోవాలి. దీనివల్ల మీరు మదుపు చేస్తున్న మొత్తం ఎంత? దానిపై వస్తున్న డివిడెండ్లు, ఇతర ప్రయోజనాలను సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుంది.
5. కనీస నిల్వ
బ్యాంకు ఖాతా కనీస నిల్వ ఎక్కువ ఉంటే ఎప్పటిక్కప్పుడు పరీక్షించుకోవాలి. ఎందుకంటే మీ ఖాతాలో నిర్ణీత సొమ్ము లేకపోతే రుసుములు చెల్లించాల్సి వస్తుంది. అందుకోసమే పెట్టుబడులు, ఖర్చులకు కేటాయించిన పొదుపు ఖాతా కనీస నిల్వ తక్కువగా ఉన్న బ్యాంకులను ఎంచుకోవాలి. దీనివల్ల మీకు పెనాల్టీలు, అదనపు రుసుముల బాధ తగ్గుతుంది. బ్యాంకు ఖాతా నిర్వహణ మొత్తం యాప్‌లోనే ఉండేలా చూసుకుంటే కావాల్సినప్పుడు ఖాతా వివరాలు చూసుకోవచ్చు.
6. ఫిక్స్‌డ్ డిపాజిట్ - మోర్ ఇన్కమ్
మీ పొదుపు ఖాతాలో ఎక్కువ మొత్తం ఉంటే, దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో జమ చేసుకునేలా ప్రత్యేక ఖాతాలు అందుబాటులో ఉంటాయి. మీకు పొదుపు ఖాతా ఉన్న బ్యాంకులో ఇలాంటి వెసులుబాటు ఉందో, లేదో తెలుసుకోండి. ఇలా చేయడం ద్వారా కాస్త అధిక వడ్డీని సాధించేందుకు అవకాశముంటుంది.
7. తక్కువ ఖాతాలు - తక్కువ పెట్టుబడి
పొదుపు ఖాతాలు మూడు నుంచి నాలుగు వరకే ఉండేలా చూసుకోవాలి. అంతకు మించి ఉండటం వల్ల అనవసరంగా కనీస నిల్వ పేరుతో డబ్బును వాటిల్లో జమ చేయాల్సి వస్తుంది. దీని వల్ల ఇతర పెట్టుబడులకు అవకాశాలను కోల్పోతాం.
సేవింగ్స్ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయొచ్చు? లిమిట్ దాటితే ఏమవుతుంది? - Cash Deposit Limit