Fixed Deposit Loan : డబ్బు అవసరం ఎప్పుడు, ఎలా ఉంటుందో తెలియదు. అందుకే అత్యవసర సమయాల్లో బంగారం అమ్మడమో, ఫిక్స్‌డ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయ్యటమో లేదా అధిక వడ్డీకీ రుణాలు తేవటమో చేస్తుంటాం. అయితే ఒకవేళ మీకు బ్యాంకులో ఎఫ్డీలు ఉంటే, అత్యవసర సమయాల్లో వాటిని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే డబ్బు పొందొచ్చు. ఎందుకంటే బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాలు ( Loan Against Fixed Deposit ) అందిస్తున్నాయి. మీ సొమ్ము మొత్తంపై 85 శాతం నుంచి మొదలై డిపాజిట్ మొత్తం కంటే ఎక్కువ రుణం కూడా పొందవచ్చు. అయితే దానికి వడ్డీ ఎంత, ఏ డాక్యుమెంట్లు కావాలి అనే వివరాలు చూద్దాం రండి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ లోన్లు
కస్టమర్లు బ్యాంకులలో కొంత కాలానికి జమ చేసిన డబ్బులే ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ప్రస్తుతం కాలంలో ఎఫ్డీలపై లోన్ల సంఖ్య చాలా పెరిగింది. అంతే కాకుండా దాదాపు అన్ని బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. 2022లో ఎఫ్డీలపై రుణాలు రూ.97.5 కోట్లుగా ఉంటే 2023లో అది రూ.113.9 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 16.7 శాతం లోన్లలో వృద్ధి నమోదైంది.
వడ్డీరేటు
సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లోన్ వడ్డీ రేటు (0.75% - 2%) మధ్య ఉంటుంది. ఎందుకంటే దీనిలో లోన్ల ఎగవేత రిస్క్ తక్కువ, అందుకే ఇంత తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. ఇంటి, వాహన రుణాలతో పాటు ఇతర ఏ రుణాలకైనా సాధరణంగా 10 శాతానికి పైగా వడ్డీ ఉంటుంది.
ఎంతవరకు లోన్?
మనం డిపాజిట్ చేసిన మెుత్తంలో 85 శాతం నుంచి మొదలై డిపాజిట్ సొమ్ము మొత్తం కంటే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం లోన్ పొందటానికి మినిమమ్ డిపాజిట్ ఉంచటం అవసరముంటుంది.
లోన్ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్
ఎఫ్డీలపై రుణాలు చాలా త్వరగా పొందవచ్చు. ఎందుకంటే దీనికి రుణగ్రహీత బ్యాంకు లావాదేవీలతో సంబంధం లేదు. నామమాత్రపు డాక్యుమెంట్స్‌తో లోన్ పొందవచ్చు.
లోన్ షూరిటీ
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లోన్లు తీసుకోవడానికి ఎటువంటి బ్యాంకు షూరిటీలు అవసరం లేదు. ఎందుకంటే మీ ఫిక్స్‌డ్ డిపాజిటే వారికి షూరిటీ. అంతే కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లోన్ తీసుకున్నప్పటికీ ఎఫ్డీలపై బ్యాంకులు వాటికిచ్చే వడ్డీని యథాతథంగా చెల్లిస్తాయి.
రీపేమెంట్
మామూలుగా రుణ చెల్లింపులు (ఈఎమ్ఐ) చేసుకోవచ్చు. వాటి మొత్తం ఎంత అనేది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వీటికి ఎటువంటి అదనపు రుసుములు ఉండవు. అయితే మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి ముగిసేలోగానే లోన్ రీపేమెంట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
అర్హత
ఎఫ్డీలపై లోన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా సదరు బ్యాంకులో ఎఫ్డీ అకౌంట్ ఉండాలి. తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
నిపుణుల సలహా
ఫిక్స్‌డ్ డిపాజిట్ రుణాలు అందించే ప్రయోజనాలు చాలా ఉన్నాయని బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి తెలిపారు. కస్టమర్లు జాగ్రత్తగా వాటిని పరిశీలించి వారికి సరిపోయే వాటిని ఎంచుకోవచ్చని తెలిపారు. అయితే లోన్ రీపేమెంట్ సకాలంలో చేయకపోతే సిబిల్‌పై ప్రభావం పడుతుందని బ్యాంక్ బజార్ సీఈఓ పేర్కొన్నారు.
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా ? అయితే డబ్బులను నష్టపోతున్నట్లే!
FDపై అధిక వడ్డీ రావాలా? SBI 'గ్రీన్ డిపాజిట్' స్కీమ్‌తో ఫుల్ లాభాలు!
మీ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చే టాప్-10 లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవే!