నో స్కిడ్డింగ్, టైర్లకు ఫుల్ గ్రిప్- ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌తో టాప్-5 కార్స్ ఇవే- బడ్జెట్ రూ.10లక్షలే! - Cars With Traction Control - CARS WITH TRACTION CONTROL
Best Cars With Traction Control : మీరు మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? బురద, ఇసుక, గులకరాళ్లు, నీళ్లు, మంచు లాంటి జారుడు ప్రదేశాల్లో మీరు డ్రైవ్ చేస్తుంటారా? అయితే ఇది మీకోసమే. మంచి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) ఉన్న టాప్-5 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Published : May 24, 2024, 3:16 PM IST
|Updated : May 24, 2024, 4:46 PM IST
Best Cars With Traction Control : కొత్తగా కారు కొనాలని అనుకునేవారు మంచి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్) ఉన్న వెహికల్ కొనుక్కోవడం మంచిది. ఈ టీసీఎస్ అనేది రోడ్డుకు, టైర్‌కు మధ్య మంచి గ్రిప్ ఉండేలా చేస్తుంది. కనుక బురద, ఇసుక, గులకరాళ్లు, నీళ్లు, మంచు లాంటి జారే స్వభావం ఉన్న రోడ్లపై కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైవ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ టైర్‌కు రోడ్డుకు మధ్య సరైన ట్రాక్షన్ లేకపోతే, కారు బ్యాలెన్స్ తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. ఎలా అంటే? ఉదాహరణకు మీ కారు బురదలో ఇరుక్కున్నప్పుడు యాక్సిలేటర్ పెంచుతారు. అప్పుడు బురదలో ఉన్న టైర్ మిగతా టైర్ల కంటే వేగంగా స్పిన్ అవుతుంది. కానీ బండి ముందుకు వెళ్లదు. ఇలాంటప్పుడు మీ కారులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కనుక ఉంటే, అది బురదలో ఉన్న టైర్ ఓవర్‌స్పిన్ కాకుండా పార్శియల్ బ్రేక్స్ వేస్తుంది. దీనివల్ల గ్రిప్ పెరిగి కారు ముందుకు వెళుతుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో మంచి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల గురించి తెలుసుకుందాం.
1. Renault Kwid : ఇండియాలో లభిస్తున్న బెస్ట్ అఫర్డబుల్ కార్లలో రెనో క్విడ్ ఒకటి. దీనిలో స్టాండర్డ్‌గా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. కనుక ఎలాంటి జారుడు ప్రదేశంలో అయినా చాలా ఈజీగా ఈ కారును నడపవచ్చు. ఈ రెనో కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 68 బీహెచ్పీ పవర్, 91 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. మార్కెట్లో ఈ రెనో క్విడ్ కారు ధర సుమారుగా రూ.4.70 లక్షలు - రూ.6.45 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
2. Hyundai Grand i10 Nios : హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఈ గ్రాండ్ ఐ10 నియోస్‌లో బోలెడు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 83 బీహెచ్పీ పవర్, 114 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఈ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధర సుమారుగా రూ.5.92 లక్షలు - రూ.8.56 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
3. Tata Tiago : టాటా టియాగో కారులో స్టాండర్డ్‌గా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. దీనిని టాటా కంపెనీ కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ అని చెబుతూ మార్కెటింగ్ చేస్తోంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 86 బీహెచ్పీ పవర్, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఈ టాటా టియాగో కారు ధర సుమారుగా రూ.5.65 లక్షలు - రూ.8.90 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
4. Hyundai Exter : భారతదేశంలోని మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో హ్యుందాయ్ ఎక్స్టర్ ఒకటి. దీనిలో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 83 బీహెచ్పీ పవర్, 114 ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది. మార్కెట్లో ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ కారు ధర సుమారుగా రూ.6.13 లక్షలు - రూ.10.28 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
5. Tata Punch : భారతదేశంలో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లలో టాటా పంచ్ ఒకటి. దీని బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనిలో బోలెడు సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. వాటిలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా స్టాండర్డ్‌గా ఉంటుంది. ఈ మైక్రో-ఎస్యూవీ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 88 బీహెచ్పీ పవర్, 115 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. మార్కెట్లో ఈ టాటా పంచ్ కారు ధర సుమారుగా రూ.6.13 లక్షలు - రూ.10.20 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
మంచి ఎలక్ట్రిక్ కార్ కొనాలా? టాప్-5 మోస్ట్ అఫర్డబుల్ e-SUVలు ఇవే! - Most Affordable Electric Cars