Bank Employees Salary Hike : బ్యాంకు ఉద్యోగులకు వార్షిక వేతనం 17 శాతం పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది. నవంబర్ 2022 నుంచి పరిగణనలోకి తీసుకున్న ఈ పెంపుతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వరంగ బ్యాంకులపై అదనంగా ఏటా రూ.8,284 కోట్లు భారం పడనున్నట్లు అంచనా.
మరోవైపు, అన్ని శనివారాలను సెలవు దినంగా గుర్తించేందుకు ఉమ్మడిగా అంగీకారానికి వచ్చినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ వెల్లడించింది. అయితే, దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే బ్యాంకులకు వారానికి ఐదు పనిరోజులే ఉండనున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కొత్త పని వేళలు అమల్లోకి వస్తాయి.
8088 డీఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు. కొత్త వేతన సెటిల్‌మెంట్ ప్రకారం మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించకుండానే నెలకు ఒక సిక్ లీవ్ తీసుకునే సౌలభ్యం ఉంది. ఉద్యోగి రిటైర్‌మెంట్ సమయంలో 255 రోజుల వరకు ప్రివిలేజ్డ్ లీవ్‌లను నగదుగా మార్చుకోవచ్చు. విధుల్లో మరణించినా, ఈ మొత్తం సంబంధీకులకు చెల్లిస్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు నెలవారీ ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. 2022 అక్టోబరు 31న, అంతకుముందు పెన్షన్ అందుకునేందుకు అర్హత ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
DA Hike Central Government Employees : ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలొవెన్స్ను (డీఏ) 4 శాతం పెంచింది కేంద్రం. దీంతో ఇప్పటివరకు ఉన్న 46 శాతం డీఏ 50 శాతానికి చేరుకున్నట్లయ్యింది. 2024, జనవరి 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ తాజా నిర్ణయంతో దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వెల్లడించారు. డీఏ/డీఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.12,869 కోట్ల అదనపు భారం పడనున్నట్లు అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దీని ప్రభావం రూ.15,014 కోట్లు ఉండవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.