5 Days Working In Bank : బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. ఇకపై బ్యాంకులు వారానికి 5 రోజులు మాత్రమే పని చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బ్యాంక్ ఉద్యోగుల సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఓ లేఖ రాసింది. ఇందులో బ్యాంకు ఉద్యోగుల జీతాలను కూడా పెంచాలనే అంశాన్ని ప్రస్తావించింది. ఒకవేళ వీటికి ఆర్థిక మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపితే గనుక ఈ ఏడాది జూన్ నుంచే ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను అందించే పనివేళల విషయంలో మాత్రం ఎటువంటి కోతలు ఉండబోవని మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నాయి బ్యాంకు సంఘాలు.
ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన ఇది
'బ్యాంకులు కూడా వారానికి 5 రోజులే పని చేసేలా ఉత్తర్వులు, అలాగే ఉద్యోగుల శాలరీ హైక్ అంశం, ఈ రెండింటిని సమీక్షించి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. తదనుగుణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఆదేశాలు ఇవ్వాలి' అని బ్యాంక్ సంఘాల తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. వారానికి 5 రోజులు పనివేళలు ఇప్పటికే ఆర్‌బీఐ, ఎల్ఐసీ ఉద్యోగులకు అమలవుతున్నాయన్న విషయాన్నీ ప్రస్తావించింది.
ప్రతిరోజు 40 నిమిషాలు అదనంగా పనిచేస్తాయా?
అయితే కొద్దిరోజుల క్రితం కూడా చేసిన ప్రతిపాదనల్లో వారానికి 5 రోజులు పనిదినాలకు బదులుగా ప్రతిరోజు 40 నిమిషాలు అదనంగా బ్యాంకు ఉద్యోగులు పనిచేయాలని ప్రతిపాదించాయి బ్యాంక్ యూనియన్లు. మరి తాజా ప్రతిపాదనలో ఈ విషయాన్ని ప్రస్తావించారా? లేదా అన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు 2015లో వచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం దేశంలోని వివిధ బ్యాంకులు ప్రతినెలా రెండో, నాలుగో శనివారాల్లో పనిచేయట్లేదు. కాగా, తాజాగా చేసిన ప్రతిపాదనపై ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందిస్తే మరి కొద్దిరోజుల్లోనే మిగతా రెండు లేదా మూడు శనివారాలూ కూడా బ్యాంకులకు సెలవు దినాలు రానున్నాయి.
బ్యాంకు ఉద్యోగులకు జీతాల పెంపు
Salary Hike For Bank Employees : బ్యాంక్ సిబ్బందికి సంబంధించిన వేతన సవరణ విషయంలో గతేడాది డిసెంబర్ 7న ఐబీఐ, బ్యాంక్ యూనియన్ల మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. దీని ప్రకారం దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఉద్యోగులకు 17% జీతం పెరగనుంది. కాగా, దీని విలువ రూ.12,449 కోట్లు. ఒకవేళ పై ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే గనుక ఎస్బీఐ సహా ఇతర ప్రైవేటు రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న 9 లక్షల మంది బ్యాంక్ సిబ్బంది శాలరీ హైక్‌తో పాటు వారానికి 5 రోజుల పని ప్రయోజనాలను పొందనున్నారు.
కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఇది మీకోసమే!
స్వల్పంగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు- హైదరాబాద్, విజయవాడలో ఎంతంటే?