Vinesh Phogat Bajrang Punia Congress : హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై పార్టీ ఎన్నికల ప్యానెల్ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ నాయకురాలు వినేశ్ ఫొగాట్ తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరసన సమయంలో తమను రోడ్డు మీదకు ఈడ్చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు తమకు అండగా నిలిచాయని చెప్పారు. తన పోరాటం ముగియలేదని, భవిష్యత్‌లో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని, కచ్చితంగా న్యాయమే గెలుస్తుందని తెలిపారు. ఇప్పుడు మరో వేదిక దొరికిందని, దేశసేవకు శక్తివంచన లేకుండా కష్టపడతానని చెప్పారు.
VIDEO | " i want to thank people of the country for supporting us in our wrestling journey. i want to thank the congress party... when we were being dragged on the roads, all the parties except bjp were with us. they understood our pain, our tears. i am feeling very proud that i… pic.twitter.com/URZiw0mChM
— Press Trust of India (@PTI_News) September 6, 2024
'బీజేపీ మహిళా ఎంపీలందరికీ లేఖలు రాశాం'
అనంతరం కాంగ్రెస్ నేత భజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల విషయంలో రాజకీయాల కోసమే రాద్ధాంతం సృష్టించామని బీజేపీ ఐటీ సెల్ చెబుతోందని భజరంగ్ అన్నారు. గతంలో బీజేపీ మహిళా ఎంపీలందరికీ లేఖలు రాశామని తెలిపారు. మహిళల తరఫున గొంతు వినిపించాలని వేడుకున్నామని చెప్పారు. కానీ ఎవరూ ముందుకు రాలేదని, పార్టీ గీసిన గీత దాటలేదని విమర్శించారు.
#WATCH | Delhi | On joining Congress, Bajrang Punia says, " ...what bjp it cell is saying today that we just wanted to do politics...we had written to all women bjp mps to stand with us but they still didn't come. we are paying to raise the voices of women but now we know that bjp… pic.twitter.com/FGViVeGJLY
— ANI (@ANI) September 6, 2024
'బీజేపీ ఐటీ సెల్ సంబరాలు చేసుకుంది'
బీజేపీ మినహా అన్ని పార్టీలు తమకు అండగా నిలిచాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, దేశాభివృద్ధికి శక్తిమేర కృషి చేస్తామని వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు దేశమంతా సంబరపడిందని చెప్పారు. కానీ, ఆ తర్వాత రోజు ఆమెను అనర్హురాలిగా ప్రకటించినప్పుడు అందరూ బాధతో కుంగిపోయారని తెలిపారు. ఒక్క బీజేపీ ఐటీ సెల్ మాత్రం సంబరాలు చేసుకుందని ఆరోపించారు.
రైల్వే ఉద్యోగాలకు రాజీనామా
హరియాణా ఎన్నికల వేళ దిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వినేశ్, భజరంగ్ పునియా శుక్రవారం సాయంత్రం హస్తం కండువా వేసుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. కాగా, పార్టీలో చేరడానికంటే ముందే భారత రైల్వేలో తమ ఉద్యోగాలకు వినేశ్, పునియా రాజీనామా చేశారు.
#WATCH | Delhi: Vinesh Phogat and Bajrang Punia join the Congress party
— ANI (@ANI) September 6, 2024
Party's general secretary KC Venugopal, party leader Pawan Khera, Haryana Congress chief Udai Bhan and AICC in-charge of Haryana, Deepak Babaria present at the joining. pic.twitter.com/BrqEFtJCKn
హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇటీవల భేటీ అయింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చ జరిపిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ ఫొటోను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దాంతో వారు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమంటూ వచ్చిన వార్తలు తాజాగా నిజమయ్యాయి.
ఇప్పటికే వినేశ్ ఫొగాట్ సోదరి బబితా ఫొగాట్ బీజేపీలో ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బబితకు కమలం పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే స్థానం నుంచి వినేశ్‌ను దించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులు చేశారంటూ బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో వినేశ్, పునియా కీలకంగా వ్యవహరించారు.
మాకేం అభ్యంతరం: బీజేపీ
అయితే కాంగ్రెస్ పార్టీలో వినేశ్ ఫొగాట్ చేరడంపై బీజేపీ స్పందించింది. దేశ్ కీ బేటీ నుంచి కాంగ్రెస్ కీ బేటీగా వినేశ్ మారాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీజీపీ సీనియర్ నాయకుడు అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మద్దతుతోనే దిల్లీలో రెజ్లర్లు ఉద్యమాన్ని ప్రారంభించారని ఆరోపించారు.