Boy Kicks Bomb Mistaking As Ball : బంగాల్‌లోని పాండువాలో ఓ బాలుడు ఆడుకుంటూ బాల్ అనుకొని నాటు బాంబును కాలితో తన్నాడు. దీంతో అది భారీ శబ్దంతో పేలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ బాలుడు చనిపోయాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరు బాలురు గాయపడ్డారు.
ఇదీ జరిగింది
సోమవారం ఉదయం 8 గంటలకు పాండువా పట్టణంలో రాజ్ బిస్వాస్ (11) అనే బాలుడు ఆడుకుంటూ బాల్ అనుకొని ఓ నాటు బాంబును కాలితో తన్నాడు. దీంతో అది వెంటనే భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో బాంబును తన్నిన బాలుడితో పాటు మరో ఇద్దరు బాలురకు గాయాలయ్యాయి. వారిని గమనించిన స్థానికులు వెంటనే సమీపంలోని పాండువా రూరల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజ్ బిస్వాస్ పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి చుంచుర ఇమాంబర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
రాజ్ బిస్వాస్ అనే బాలుడు బుర్ద్వాన్‌కు చెందిన వాడని, వేసవి సెలవుల్లో పాండువాలోని తన మామయ్య ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ఇద్దరు బాలురను రూపమ్ బల్లభ్ (13), సౌరవ్ చౌదరి (13)గా గుర్తించారు. వీరు ఏడో తరగతి చదువుతున్నట్లు వెల్లడించారు. రూపమ్ చేతులకు గాయాలవగా, సౌరవ్ కాలికి గాయాలయ్యాయి.
"మా మనవడు రూపమ్ బల్లభ్ ఇంట్లో టీవీ చూస్తుండగా అతడి స్నేహితుడు శాంతు బయట ఆడుకుందామని పిలిచాడు. వాళ్లతో కలిసి ఆడుకునేందుకు రూపమ్ బల్లభ్ వెళ్లిన కాసేపటికే పెద్ద శబ్దం వినిపించింది. బయటికి వెళ్లి చూడగా నా మనవడి ఎడమ చేతికి గాయమై నేలపై పడి ఉన్నాడు"
--ఉషా బల్లభ్, బాలుడి తాత
ఈ ఘటన వెనుక టీఎంసీ : లాకెట్ ఛటర్జీ
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ హూగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుకు టీఎంసీనే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు టీఎంసీ ఇలాంటి విధ్వంసకర మార్గాలను ఆశ్రయిస్తోందన్నారు.
సోమవారం మరికొన్ని గంటల్లో పాండువాలో టీఎంసీ అగ్రనేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బహిరంగ సభ జరగనుండగా ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అంతకుముందు ఏప్రిల్ 30న ముర్షిదాబాద్‌లోని బెల్దంగా, రాజ్‌నగర్‌లోనూ ఇదే తరహా అనుమానాస్పద పేలుడు సంభవించింది.