well For Anganwadi Kids : అంగన్వాడీలో చదువుకునే పిల్లల తాగునీటి కోసం ఓ మహిళ బావి తవ్వింది. ప్రభుత్వ అనుమతి తీసుకోలేదనే కారణంగా ఆమె బావిని మూసేయాలని మంత్రి, అధికారులు సూచించారు. దీనిపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. స్పందించిన ఎంపీ కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
గణేశ్ నగర్‌లోని అంగన్వాడీ కేంద్రానికి చెందిన పిల్లలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని గౌరీ నాయక అనే మహిళ భావించింది. అందులో భాగంగా బావిని తవ్వే పనిని ఒక వ్యక్తి సహాయంతో చేపట్టింది. 30 అడుగుల లోతు వరకు బావి తవ్వకం పని పూర్తయింది. అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా బావి నిర్మాణం చేపట్టినందును వెంటనే పనులు నిలిపివేయాలని, ప్రభుత్వం ఈ పనిని చేస్తుందని మంత్రి మంకాలు వైద్య ఆమెకు సూచించారు. అయితే మంత్రికి గౌరవమిచ్చి పనులను గౌరి నాయక నిలిపివేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో అధికారులు కూడా అక్కడ ఉన్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో బావిని మూసివేశారు.
అంగన్వాడీ విద్యార్థుల కోసం తవ్విన బావిని అడ్డుకోవడం పట్ల గణేశ్ నగర్ ప్రాంతంలోని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. స్థానికులంతా ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని మూసివేసిన బావిని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఎంపీ అనంతకుమార్ హెగ్డే దృష్టికి వచ్చింది. ఆయన జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి బావి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు ఎంపీ అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ అనుమతులు మంజూరు చేశారు. దీంతో మూతపడిన బావిని తిరిగి ప్రారంభించారు. అంగన్వాడీ చిన్నారుల కోసం చేపట్టిన బావి నిర్మాణ పనులు ఆగిపోయినప్పుడు గౌరి నాయక చాలా ఆందోళన చెందారు. కనీసం భోజనం కూడా చేయలేదు. మొత్తానికి ఎంపీ చొరవతో మూసేసిన బావికి అనుమతులు లభించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. బావిని మరో 5-6 రోజుల్లో ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.
స్పందించిన జిల్లా కలెక్టర్, ఎంపీ
బావిని ప్రారంభించే విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. మానవతా దృక్పదంతో బావి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ గంగూబాయ్ మన్కర్ తెలిపారు. 'వారు మంచి పని చేస్తున్నారు. వారిని చేయనిద్దాం' అన్నారు.
మరోవైపు ఎంపీకూడా ఈ అంశంపై స్పందించారు. 'మేము గౌరి నాయకకు మద్దతుగా నిలిచాము. బావికి ఆమె పేరు పెట్టాలని సూచించాను. ఇది భావోద్వేగానికి సంబంధించిన అంశం. గతం గురించి ఇప్పడు మాట్లాడవద్దు.' అని ఎంపీ అనంతకుమార్ హెగ్డే హితవు పలికారు.