VVPAT History In Telugu : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన వేళ వీవీప్యాట్లపై మరోసారి చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి, తాము వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటర్లు ధ్రువీకరించుకోవడానికి వీవీప్యాట్లను ఎన్నికల సంఘం తొలిసారిగా 2013లో ప్రవేశపెట్టింది.
నాగాలాండ్‌లో తొలిసారి
నాగాలాండ్‌లోని నోక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో తొలిసారిగా వీవీప్యాట్‌ను వినియోగించారు. ఒక బ్యాలట్ యూనిట్, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్‌ను కలిపి ఈవీఎం అని వ్యవహరిస్తారు. బ్యాలట్ యూనిట్ ధర 7,900 రూపాయలు, కంట్రోల్ యూనిట్ ధర 9,800 రూపాయలు, వీవీప్యాట్ ధర 16 వేల రూపాయలుగా ఉంటుంది.
ఇప్పటివరకు ఈవీఎంలలో!
2019 నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలలో పోలైన ఓట్లతో వందశాతం సరిపోలుస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈసీ ఈ విధానం ఎంచుకుంది. ఇప్పటివరకు ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులు సరిపోలకపోవడం అనేది జరగలేదని కేంద్ర ఎన్నికల సంఘం అంటోంది.
ఏడు సెకన్ల పాటు!
ఓటరు ఈవీఎంలో ఓటు వేసిన వెంటనే వీవీప్యాట్ యూనిట్‌లో పార్టీ సింబల్‌తో కూడిన గుర్తు ఏడు సెకన్ల పాటు చిన్న విండోలో కనిపిస్తుంది. ఆ స్లిప్పు బాస్కెట్‌లో పడుతుంది. రహస్య బ్యాలట్ పద్ధతిలో దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున వీవీప్యాట్ స్లిప్పును ఓటర్లు ఇంటికి తీసుకువెళ్తేందుకు వీలు ఉండదు. ఈవీఎంలను, వీవీప్యాట్ స్లిప్పులను స్ట్రాంగ్ రూమ్‌లలో 45 రోజుల పాటు భద్రపర్చాలని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ 45 రోజుల్లోగా ఎవరైనా హైకోర్టులో ఫలితాలను సవాలు చేసే వీలు ఉంటుంది.
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఈవీఎం-వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేసింది.