Telangana Tourism Tour Package from Hyderabad to Araku: సమ్మర్ హాలిడేస్‌లో టూర్‌కి వెళ్లాలని ప్రతి ఒక్కరూ ప్లాన్ చేస్తుంటారు. తమ బడ్జెట్‌కు తగ్గట్టు నచ్చిన ప్రాంతాలను చుట్టేసి రావాలనుకుంటారు. మరి మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. తెలంగాణ టూరిజం ఓ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి అరకుకు అతి తక్కువ ధరలో సూపర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ మొత్తం 4 రాత్రులు, 5 రోజులుగా సాగుతుంది. ప్రతీ బుధవారం టూర్ షెడ్యూల్ ఉంటుంది. ఇంతకీ ఈ టూర్ ఎలా సాగుతుంది.? ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి? టికెట్ ధరలు ఎంత వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
హైదరాబాద్ టూ అరకు ప్రయాణం సాగుతుందిలా:
మొదటి రోజు: తొలి రోజు సాయంత్రం టూర్ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు IRO పర్యాటక భవన్ నుంచి, CRO బషీర్‌బాగ్ నుంచి 6.30 గంటలకు బస్సు బయలు దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యంలో భోజనం ఉంటుంది.
రెండో రోజు: మరునాడు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్‌లో ఫ్రెషప్ అనంతరం బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత 10 గంటలకు కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్‌మెరైన్ మ్యూజియం చూపిస్తారు. సాయంత్రం వైజాగ్ బీచ్‌కు తీసుకెళ్తారు. బీచ్ చూసిన తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకోవాలి. రాత్రి భోజనం తర్వాత వైజాగ్ హోటల్‌లో స్టే చేయాలి.
మూడో రోజు: మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత అరకు టూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, బొర్రా గుహలు, ధింసా డ్యాన్స్ చూపిస్తారు. అదే రోజు సాయంత్రం క్రూజ్ బోట్‌లో జర్నీ ఉంటుంది. అయితే దీనికి టూరిస్టులే మనీ పే చేయాలి.( ఒక్కొక్కరికి రూ.500). తర్వాత తిరిగి హోటల్‌కి చేరుకుని.. ఆ రాత్రికి అక్కడ బస చేయాలి.
నాలుగో రోజు: నాలుగో రోజు ఉదయం అరకు నుంచి అన్నవరం బయలు దేరాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ సత్యనారాయణ స్వామి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది.
ఐదో రోజు: టూర్‌లో చివరి రోజైనా ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఇక ధరలు చూస్తే.. హైదరాబాద్ నుంచి అరకు ట్రిప్‌కు వెళ్లేందుకు పెద్దలకు ఒక్కొక్కిరికి రూ. 6,999గా ఉంటుంది. 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 5,599గా ఉంటుంది. ఇక ఈ ప్యాకేజీలో నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం, నాన్ ఏసీ హోటల్‌లో వసతి, వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కవర్ అవుతాయి. ఫుడ్, ఎంట్రీ టికెట్స్, దర్శనం టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, లాండ్రీ ఛార్జీలు టూర్ ప్యాకేజీలో కవర్ కావు. ఇవి ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ లింక్‌పై https://tourism.telangana.gov.in/ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.