Supriya Sule vs Sunetra Pawar : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఆసక్తికర పోరుకు తెర లేపాయి రెండు ప్రధాన పార్టీలు. రాష్ట్రంలో ఎంతో కీలక స్థానమైన బారామతి నుంచి వదినా- మరదళ్లు పోటీ పడుతున్నారు. ఇండియా కూటమి తరఫున శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె బరిలో ఉండగా, ఆమెకు పోటీగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను బరిలోకి దింపింది అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ. అయితే ఇదే విషయమై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నా అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేత సునీల్ టట్కరే దీనిని అధికారికంగా ధ్రువీకరించారు.
తొలిసారి వదినా-మరదళ్ల పోరు!
బారామతి లోక్‌సభ స్థానం పవార్ కుటుంబానికి గత కొన్ని దశాబ్దాలుగా కంచుకోటగా నిలుస్తోంది. అయితే ఒకే స్థానం నుంచి సై అంటోన్న ఈ ఇద్దరు అభ్యర్థులు (సుప్రియా, సునేత్ర) వరుసకు వదినా, మరదళ్లు కావడం విశేషం. వీరిద్దరు ఒకరిపై ఒకరు పోటీ చేయడం కూడా ఇదే తొలిసారి. ఇదిలాఉంటే వీరిద్దరూ ఇప్పటికే క్షేత్రస్థాయిలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. గత 55 ఏళ్లుగా బారామతి లోక్‌సభ సీటును పవార్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. తొలుత ఈ సీటు నుంచి శరద్‌పవార్ ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2009 నుంచి సుప్రియా సూలె ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు.
'ఇది కుటుంబం మధ్య పోరు కాదు'
ఎన్సీపీలో చీలిక తర్వాత బారామతి స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను బరిలో నిలుపుతారనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా శరద్ పవార్ పార్టీ అధికారికంగా తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అజిత్ పవార్ వర్గం నుంచి కూడా అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే దీనిని ఓ కుటుంబం మధ్య పోరుగా చూడవద్దని సైద్ధాంతిక పోరుగానే పరిగణించాలని టట్కరే పేర్కొన్నారు.
ఆ ముగ్గురు- ఈ ముగ్గురు!
ఇక ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమి తరఫున ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.