Chief Secretaries Of States And UTs At Supreme Court : ఒకే కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు (సీఎస్‌లు) సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. పదవీ విరమణ పొందిన జ్యుడీషియల్ అధికారులకు రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్ (ఎస్ఎన్ జేపీసీ) సిఫార్సుల మేరకు పింఛను బకాయిలు, ఇతర ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్రాలు అలసత్వం వహించడమే అందుకు కారణం.
'వారిక కోర్టుకు రావాల్సిన అవసరం లేదు'
ఈ క్రమంలో మధ్యప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, బంగాల్, బిహార్, ఒడిశా, కేరళ, దిల్లీ సహా కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్ఎన్జేపీసీ సిఫార్సుల అమలుకు సమ్మతిస్తున్నట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయి. ఈ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో అఫిడవిట్ సమర్పించిన రాష్ట్రాలపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు ఇకపై కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొంది. "రాష్ట్రాల ప్రధాన, ఆర్థిక కార్యదర్శులను కోర్టుకు పిలవడంలో మాకు ఎలాంటి ఆనందం లేదు. కానీ విచారణ సమయంలో రాష్ట్రాల తరఫున న్యాయవాదులు నిరంతరం గైర్హాజరవుతున్నారు" అని ధర్మాసనం పేర్కొంది.
అసలేం జరిగిందంటే?
అనేక ఆదేశాలు ఇచ్చినప్పటికీ, సమయం పొడిగించినప్పటికీ 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెండో నేషనల్ జ్యుడీషియల్ పే కమిషన్ సిఫార్సులను పూర్తిగా పాటించలేదని కోర్టు సహాయకునిగా (అమికస్ క్యూరీ) వ్యవహరిస్తున్న న్యాయవాది కె.పరమేశ్వర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పదవీ విరమణ పొందిన జ్యుడీషియల్ అధికారులకు ఎస్ఎన్జేపీసీ సిఫార్సులు అమలు చేయని దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు కొన్నాళ్ల క్రితం సమన్లు జారీ చేసింది. సమన్లు అందుకున్న రాష్ట్రాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బంగాల్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, అసోం, నాగాలాండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, ఝార్ఖండ్, కేరళ, బిహార్, గోవా, హరియాణా, ఒడిశా సహా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఆయా సీఎస్‌లు సుప్రీంకోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం 18 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌లు మంగళవారం సుప్రీం ఎదుట హాజరయ్యారు.