Students Made Home Safe Device : ఇంట్లో చోరీలను అరికట్టేందుకు వినూత్న పరికరాన్ని తయారుచేశారు ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ విద్యార్థినులు. శ్రీరాముడి చిత్రాన్ని ఉంచిన, ఈ పరికరానికి 'హోమ్ సేఫ్ డివైజ్' అని పేరు పెట్టారు. ఇది నేరస్థులను పట్టించడంలోనూ సాయపడుతుందట. మరెందుకు ఆలస్యం ముగ్గురు విద్యార్థినిలు తయారు చేసిన హోమ్ సేఫ్ డివైజ్ గురించి తెలుసుకుందాం.
24 గంటలు పనిచేస్తుంది
గోరఖ్‌పుర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రీతి రావత్, ఆస్తా శ్రీవాస్తవ, సాధన సాహ్నీ కలిసి ఈ పరికరాన్ని రూపొందించారు. ఇన్నోవేషన్ సెల్ కో ఆర్డినేటర్ వినిత్ రాయ్ ఆధ్వర్యంలో ఈ ముగ్గురు రేయింబవళ్లు శ్రమించి ఈ ఎలక్ట్రానిక్ డివైజ్‌ను తయారుచేశారు. ఇల్లు లేదా సంస్థలోనూ ఈ పరికరాన్ని పెట్టుకోవచ్చు. ఈ పరికరంలో ఉన్న రాముడి చిత్రంలో అమర్చిన సెన్సార్లు 24 గంటలు పనిచేస్తాయని విద్యార్థులు చెబుతున్నారు.
"ఇంట్లోకి ప్రవేశించి నేరస్థులు సులువుగా దోపిడీలు, హత్య, దొంగతనాలు చేసి తప్పించుకుంటున్నారు. వీటిని నివారించడానికి, ఇంట్లోని కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మేము శ్రీరాముని చిత్రాన్ని పెట్టి ఓ పరికరాన్ని తయారు చేశాం. ఈ డివైజ్ దొంగల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ పరికరం బాధితుడు ఇంటి దగ్గర ఉన్న పోలీసు స్టేషన్‌కు, అతని ఇరుగు పొరుగు ఉన్న వారికి సమాచారాన్ని ఇస్తుంది. భగవాన్ శ్రీరాముడి చిత్రంలో పానిక్ GSM చిప్‌ను ఇన్‌స్టాల్ చేశాం. ఈ పరికరంలో సిమ్ కార్డు ఉంది. రామయ్య చిత్రానికి అనేక వైర్‌లెస్ పానిక్ బటన్లను లింక్ చేయవచ్చు. ఈ బటన్లను ఇంటి లోపల, లాకర్, టీవీ రిమోట్లో అవసరాన్ని బట్టి అమర్చవచ్చు."
-ఆస్తా శ్రీవాస్తవ, విద్యార్థిని
ఇంట్లో ఏదైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఇంటి లోపల అమర్చిన పానిక్ బటన్‌ను నొక్కాలి. ఈ బటన్‌ను నొక్కిన వెంటనే మీరు ఇబ్బందుల్లో ఉన్నారనే సమాచారం సమీపంలోని పోలీసు స్టేషన్‌కు చేరుతుంది. అలాగే సహాయం కోసం అలారంతో పాటు ఇంటి పైకప్పుపై ఉన్న హెల్ప్ లైట్ కూడా వెలుగుతుంది. దీంతో ఇంటి సమీపంలోని ప్రజలు కూడా మీరు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుంటారు. ఈ డివైజ్‌లో రాముడి చిత్రమే కాకుండా ఇతర చిత్రాలేవైనా పెట్టుకోవచ్చట. ప్రజల కోరిక మేరకే హోమ్ సేఫ్ డివైజ్‌లో రాముడి చిత్రాన్ని ఏర్పాటు చేశారట.
అతి తక్కువ ఖర్చుతో రూపకల్పన
ఈ పరికరం తయారీకి కేవలం రూ.2వేలు ఖర్చు, 4 రోజుల సమయం పట్టింది. ఇందులో హూటర్ అలారం, 12 వోల్ట్ బ్యాటరీ, రెడ్ లైట్, కార్డ్ బోర్డ్‌తో తయారు చేసిన శ్రీరాముడి చిత్రం, GSM కాలింగ్ మోడల్, రిలే 5 వోల్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ స్విచ్ ఉన్నాయి.
తమ కాలేజీ స్టూడెంట్స్ హోమ్ సేఫ్ డివైజ్‌ను రూపొందించడంపై గోరఖ్‌పుర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ (GIDA) సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తమ కాలేజీ ఇన్నోవేషన్ సెల్‌లో విద్యార్థులు దేశానికి, సమాజానికి ఉపయోగపడే పరికరాన్ని తయారుచేశారని సంస్థ డైరెక్టర్ ఎన్కే సింగ్ తెలిపారు. విద్యార్థుల ఆలోచనలతో ప్రజలకు ఉపాధి కల్పించేలా స్టార్టప్ కేటగిరీ కింద వచ్చే ఇలాంటి ప్రాజెక్టులను కూడా మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
పక్షులకు వడదెబ్బ- ఈ ఆస్పత్రిలో స్పెషల్ ట్రీట్మెంట్తో బిగ్ రిలీఫ్! - Special Hospital For Birds