Smart Parking Instrument : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు ఓ స్మార్ట్ పార్కింగ్ పరికరాన్ని రూపొందించారు. నగరంలో వేగంగా వాహనం పార్కింగ్‌కు వీలుకల్పించడం సహా తొందరగా తీసుకెళ్లేందుకు ఈ పరికరం ఉపయోగపడనుంది. ఈ డివైజ్ రూపకల్పన కోసం మున్సిపల్ అధికారులు ఓ అంకుర సంస్థ సాయం తీసుకున్నారు. ఈ స్మార్ట్ పార్కింగ్ పరికరం సెన్సార్ల సాయంతో పనిచేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా అహ్మదాబాద్ నగరంలోని సింగూభవన్ రోడ్‌లో 5 డివైజ్‌లను ఏర్పాటు చేశారు. ఈ తరహా డివైజ్ దేశంలో ఎక్కడా లేదనీ, మేకిన్ ఇండియా స్ఫూర్తితో ఈ స్మార్ట్ పార్కింగ్ పరికరాన్ని రూపొందించినట్టు అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు తెలిపారు.
"మేము అహ్మదాబాద్‌లోని ఓ అంకుర సంస్థతో కలిసి ఓ స్మార్ట్ పార్కింగ్ పరికరాన్ని రూపొందించాం. అది ఒక ఫ్లాప్ వంటి నిర్మాణం కలిగి వాహనాన్ని అడ్డుకునేలా ఉంటుంది. ఆన్ స్ట్రీట్ పార్కింగ్( రోడ్డు పక్కన నిలపడం) కోసం ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఏదైనా వాహనం ఈ పరికరం వద్దకు వచ్చినప్పుడు దాని ఫ్లాప్ పైకి లేచి అడ్డుగా ఏర్పడుతుంది. ఎంతసేపైనా వాహనం అక్కడ నిలపవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత ఫ్లాప్ కిందకు రాగానే వాహన చోదకులు తమ వాహనాన్ని తీసుకెళ్లవచ్చు."
--రమ్య భట్, ఏఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్
ఏదైనా పని నిమిత్తం నగరంలోకి వెళ్లినప్పుడు రద్దీ సమయాల్లో వాహనాన్ని పార్కింగ్ చేయాలంటే కష్టపడాల్సి వస్తుందని స్మార్ట్ పార్కింగ్ సృష్టికర్త హార్దిక్ చెప్పారు. వాహనం ఎప్పుడు వచ్చింది, ఎంతసేపు ఉంటుందనే విషయాలను చెప్పి రశీదు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఈ పరికరం వెంటనే వాహనాన్ని పార్క్ చేయటానికి వీలు కల్పించడం సహా త్వరగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని హార్దిక్ చెప్పారు.
వాహనం పార్క్‌చేసిన పరికరంపై క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు హార్దిక్. స్కాన్ చేస్తే కారు ఏ పార్కింగ్ స్లాట్‌లో ఉంది. ఏ జోన్, దాని అడ్రెస్ ఏంటి, ఎప్పుడు పార్క్ చేశారనే విషయాలన్నీ తెలుస్తాయని హార్దిక్ వివరించారు. అన్నిరకాల పేమెంట్స్ మాధ్యమాల ద్వారా పార్కింగ్ బిల్లు చెల్లించవచ్చన్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావటం వల్ల త్వరలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు.
చెరువులోకి దూసుకెళ్లిన టాక్టర్- 24మంది యాత్రికులు మృతి
విమానంలో ఏసీ బంద్- ఇంజిన్ ఫెయిల్- వృద్ధుడు సహా చిన్నపిల్లలకు అస్వస్థత!