Shashi Tharoor on Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకొందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ఆమెకు మనం సాయం చేయకపోతే, అది భారత్‌కు అవమానమే అవుతుందని పేర్కొన్నారు. పొరుగుదేశంలో అధికార మార్పు భారత్‌ను ఆందోళనకు గురిచేసే అంశమే కాదన్నారు. తాజాగా ఓ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
'షేక్ హసీనాకు మనం సాయం చేయకపోతే, భవిష్యత్తులో ఎవరూ మనకు మిత్రులుగా ఉండేందుకు ఇష్టపడరు. మన మిత్రులు సమస్యల్లో ఉంటే, ఎప్పుడూ సాయం చేయడానికి ఆలోచించకూడదు. కచ్చితంగా వారిని సురక్షితంగా ఉంచేలా చూడాలి. ఇప్పుడు భారత్ కూడా అదే పని చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. అంతకు మించి నేనేమీ కోరుకోవడం లేదు. ఒక భారతీయుడిగా మనం ప్రపంచం కోసం నిలబడే విషయంలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి. షేక్ హసీనాను ఇక్కడికి తీసుకొచ్చి రక్షణ కల్పించి ప్రభుత్వం సరైన పనే చేసింది. ఆమె ఇక్కడ ఎన్నాళ్లు ఉంటారన్నది మనకు అనవసరం. మనం ఎవరినైనా ఇంటికి పిలిచిన తర్వాత ఎప్పుడు వెళ్లిపోతారు అని అడగము కదా. ఆమె ఇక్కడ ఎన్నాళ్లు ఉండాలనుకుంటే, అప్పటి వరకు మనం వేచి చూసే వైఖరిని పాటించాలని భావిస్తున్నా' అని శశి థరూర్ అన్నారు.
అదొక్కటే ఊరట
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో శశి థరూర్ స్పందించారు. 'కచ్చితంగా బంగ్లాదేశ్‌లో కొన్ని దాడులు జరిగాయి. ఇది కాదనలేని విషయం. కానీ అదే సమయంలో కొందరు ముస్లింలు అక్కడి హిందువులను, దేవాలయాలను కాపాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇన్ని చెడు వార్తల మధ్య అదొక్కటే కొంచెం ఊరట కలిగించే అంశంగా ఉంది. బంగ్లాదేశ్ విమోచన దృశ్యాలతో ముజిబ్‌నగర్‌లో నిర్మించిన 1971 షహీద్ మెమోరియల్‌ను బంగ్లాదేశ్ ఆందోళనకారులు ధ్వంసం చేయడం బాధాకరం. ఆందోళనకారుల అజెండా స్పష్టంగా తెలుస్తోంది. నూతన తాత్కాలిక ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని శాంతిభద్రతలను కాపాడాలి' అని శశి థరూర్ కోరారు.
Sad to see images like this of statues at the 1971 Shaheed Memorial Complex, Mujibnagar, destroyed by anti-India vandals. This follows disgraceful attacks on the Indian cultural centre, temples and Hindu homes in several places, even as reports came in of Muslim civilians… pic.twitter.com/FFrftoA81T
— Shashi Tharoor (@ShashiTharoor) August 12, 2024
'ఇంకొన్ని రోజులు దిల్లీలోనే హసీనా'- 'బంగ్లా పరిస్థితులు భారత్‌కు ఓ గుణపాఠం!' - Bangladesh Crisis