Sanjay Singh Liquor Policy Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ నాయకుడు సంజయ్ సింగ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా 6 నెలల తర్వాత సింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందు సంజయ్ సింగ్ పిటిషన్‌పై విచారణ జరగగా, ఆయనకు బెయిల్ మంజూరు చేయడంపై తమకు అభ్యంతరం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ఆయనకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ PB వరాలే నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
ట్రయల్ కోర్టు నిర్ణయించే షరతుల ప్రకారం నడుచుకోవాలని ఆయనకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. రాజకీయ కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుమతి ఉందని వెల్లడించింది. విడుదలైన తర్వాత మాట్లాడిన సంజయ్‌సింగ్, సత్యమేవ జయతే అని ఉద్ఘాటించారు.
భోజన విరామానికి ముందు విచారించిన సుప్రీం, సంజయ్ సింగ్ కస్టడీ పొడగింపుపై ఈడీ స్పందనను చెప్పాలని సూచించింది. భోజన విరామం అనంతరం దీనిపై స్పందన తెలపాలని ఈడీ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ఆదేశించింది. ఆయన రూ.2కోట్లు లంచం తీసుకున్నట్లు చేసిన ఆరోపణలు విచారణలో తేలలేదని చెప్పింది. సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరుపై ఆయన తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. సంజయ్‌కు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి ఆధారాలను సమర్పించలేకపోయిందని చెప్పారు. అందువల్లే కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు.
ఆప్‌నకు భారీ ఊరట
మరోవైపు సుప్రీం తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ నేత అతిశీ స్వాగతించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. మరో నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు ఓ గొప్ప మైలురాయని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ముందు నాయకత్వ లేమితో సతమతమవుతున్న ఆప్‌నకు సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు కావడం ఊరటనిచ్చే అంశం. ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ఇదే మధ్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. అంతకుముందే మరో కీలక నేతలు మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ అరెస్టై జైలులో ఉన్నారు.