Wash On Wheels Toilet Cleaning Service : గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచేందుకు మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా యంత్రాంగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. టాయిలెట్లను శుభ్రంగా ఉంచేందుకు 'స్వచ్ఛతా సాథీ వాష్ ఆన్ వీల్' అనే కార్యక్రమంలో ముందుకెళ్తోంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే స్వచ్ఛత సాథీ నేరుగా కార్యాలయానికి చేరుకుని టాయిలెట్లను క్లీన్ చేస్తారు. ఈ కార్యక్రమం స్వచ్ఛతా ప్రచారాన్ని ప్రోత్సహించడమే కాకుండా స్వచ్ఛతా సాథీ ఉపాధిని కూడా కల్పిస్తోంది.
'పెరిగిన కార్మికుల ఆదాయం'
టాయిలెట్లు శుభ్రం చేయడం ద్వారా గతంలో నెలకు రూ.6- 8 వేలు మాత్రమే వచ్చేదని శానిటేషన్ కార్మికుడు శైలేంద్ర కుమార్ తెలిపారు. స్వచ్ఛతా సాథీ వాష్ ఆన్ వీల్ కార్యక్రమం తర్వాత రోజుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు సంపాదిస్తున్నామని పేర్కొన్నారు. క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు యూనిట్‌కు రూ.200, అదే 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే యూనిట్‌కు రూ.250గా నిర్ణయించారని వెల్లడించారు.
'శుభ్రతతో పాటు కార్మికులకు ఉపాధి'
"పరిశుభ్రతతో పాటు ప్రజలకు ఉపాధిని కల్పించడానికి స్వచ్ఛతా సాథీ వాష్ ఆన్ వీల్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యం కిట్‌ను అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రశంసించింది. త్వరలో దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో స్వచ్ఛతా సాథీ వాష్ ఆన్ వీల్ కార్యక్రమం గురించి వివరిస్తాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు వేయవచ్చు."
- శిలేంద్ర సింగ్, కలెక్టర్
'మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు'
పురుషులే కాదు మహిళలు కూడా స్వచ్ఛతా సాథిగా పనిచేస్తున్నారని జిల్లా పంచాయతీ అధికారి అగ్రమ్ కుమార్ తెలిపారు. జున్నార్ దేవ్ డెవలప్మెంట్ బ్లాక్‌కు చెందిన బబిత అనే మహిళ స్వచ్ఛతా సాథిగా మారి ఉపాధి పొందుతోందని పేర్కొన్నారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం సహా ఉపాధి కల్పించడానికి స్వచ్ఛతా సాథీ వాష్ ఆన్ వీల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాగా, స్వచ్ఛతా సాథీ వాష్ ఆన్ వీల్ కార్యక్రమం వల్ల మంచి ఆదాయం లభిస్తుందని కార్మికురాలు బబిత అభిప్రాయపడ్డారు. మంచి ఇల్లు కట్టుకోవాలన్నదే తన కల అని పేర్కొన్నారు.
ఆ సమస్యను అధిగమించేందుకే!
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో మరుగుదొడ్లు నిర్మించినా పరిశుభ్రత, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల వాటిని వినియోగించడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఛింద్వారా జిల్లా యంత్రాంగం స్వచ్ఛతా సతి వాష్ ఆన్ వీల్ కార్యక్రమాన్ని చేపట్టింది.