Sandeshkhali Violence Accused : బంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్‌ను పోలీసులు ఎట్టకేలకు సీబీఐకి అప్పగించారు. బుధవారం సాయంత్రం 4.15గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లో అతడిని, కేసు వివరాలను సీబీఐకి అప్పగించాల్సిందేనంటూ కలకత్తా హైకోర్టు డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో తాజా పరిణామం జరిగింది. దీంతో రెండు రోజులుగా బంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ఏజెన్సీల మధ్య కొనసాగిన హైడ్రామాకు తెరపడినట్లయింది.
మంగళవారం సాయంత్రమే కేసు నమోదు!
నిజానికి సందేశ్‌ఖాలీ కేసుకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతలను కలకత్తా హైకోర్టు మంగళవారమే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై బంగాల్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. తాము తక్షణమే దీనిపై విచారణ జరపలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ బాధ్యతలు తీసుకుని మంగళవారం సాయంత్రానికే కేసు నమోదు చేసింది.
రెండు గంటలపాటు వేచి చూసినా!
నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారుల బృందం కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా అక్కడ నాటకీయ పరిణామాలు జరిగాయి. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున షాజహాన్ షేక్‌ను అప్పగించేందుకు బంగాల్ పోలీసులు నిరాకరించారు. దీంతో మంగళవారం దాదాపు రెండు గంటల పాటు వేచి చూసిన సీబీఐ బృందం అక్కడినుంచి ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.
పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు!
బుధవారం సీబీఐ మరోసారి కలకత్తా హైకోర్టును ఆశ్రయించి పోలీసుల తీరును వివరించి సీఐడీపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని కోరింది. సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి స్టే విధించకపోవడం వల్ల బంగాల్ పోలీసుల తీరును తప్పుబట్టింది హైకోర్టు. బుధవారం సాయంత్రం 4.15 గంటల కల్లా నిందితుడిని సీబీఐకి అప్పగించాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం షాజహాన్ షేక్‌తో పాటు కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ సీబీఐకి పోలీసులు అప్పగించారు.
సందేశ్‌ఖాలీలో దశాబ్దాల పాటు బలమైన నేతగా ఎదిగిన షాజహాన్- అక్కడి ప్రజలను శాసించడం మొదలుపెట్టారు. స్థానికుల నుంచి భూములను లాక్కోవడం, ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం వంటి ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా అతడి పలుకుబడి చూసి ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఇటీవల ఈడీ దాడుల అనంతరం కొంతమంది మహిళలు షాజహాన్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. దీంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.