Sandeshkhali Incident Supreme Court : బంగాల్‌ను కుదిపేస్తోన్న సందేశ్‌ఖాలీ కేసులో కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఘటనను మణిపుర్ పరిస్థితులతో పోల్చొద్దని పిటిషనర్‌కు సూచించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం పిల్‌ను పరిశీలించింది.
ఇప్పటికే ఈ కేసును కలకత్తా హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసే అంశాన్ని హైకోర్టు పరిశీలించవచ్చని తెలిపింది. 'పరిస్థితులను సరిగ్గా అంచనా వేసేందుకు స్థానిక హైకోర్టు ఉత్తమమైన వేదిక. రెండుచోట్లా విచారణలు అనవసరం' అని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు అనుమతి మంజూరు చేసింది.
పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే
సందేశ్‌ఖాలీ కేసులో పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై లోక్‌సభ సెక్రటేరియట్, కేంద్ర హోంశాఖకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సందేశ్‌ఖాలీలో గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవల బాధితులను కలిసేందుకు వెళ్తుండగా జరిగిన ఘర్షణల్లో బంగాల్ బీజేపీ చీఫ్, ఎంపీ సుకాంత మజుందార్ గాయపడ్డారు. దీంతో ఆయన లోక్‌సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన లోక్‌సభ సెక్రటేరియట్ ప్రివిలేజెస్ కమిటీ బంగాల్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం (ఫిబ్రవరి 19న) కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీనిపై బంగాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై సోమవారం దర్యాప్తు చేపట్టిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్, బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. అప్పటిదాకా లోక్‌సభ కమిటీ దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.
బంగాల్లో రాష్ట్రపతి పాలన!
సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ నేతలు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో బంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్(NCW) రేఖా శర్మ డిమాండ్ చేశారు. అలాగే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు. బంగాల్లో తన బృందంతో కలిసి రేఖా శర్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వ్యాఖ్యలను అధికార టీఎంసీ ఖండించింది. ఆమె వ్యాఖ్యలు బీజేపీ అజెండాను ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది. ఇలాంటి ఆరోపణలు వచ్చిన బీజేపీ పాలిత రాష్ట్రాలకు రేఖా శర్మ ఎందుకు వెళ్లరని ప్రశ్నించింది. 'గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి తగలబెట్టిన ఘటన జరిగిన మధ్యప్రదేశ్‌కు ఎందుకు రేఖా శర్మ వెళ్లలేదు. బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులపై మహిళా రెజ్లర్లు నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆమె ఎందుకు స్పందించలేదు. గత కొన్ని నెలలుగా మణిపుర్ మండుతోంది. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా చేశారా? ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారా? జాతీయ మహిళా కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.' అని పేర్కొంది.
'బ్యాలెట్ పేపర్లు, వీడియోలను తీసుకురండి'- చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం తీర్పు
'అప్పటివరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనను'- సీట్ల పంపకంపై ఎస్పీ- కాంగ్రెస్ మధ్య చిచ్చు