RTC Bus Ticket For Parrots : కర్ణాటక బెంగుళారులోని కేఎస్ఆర్టీసీలో బస్సులో ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న నాలుగు చిలుకల కోసం కండక్టర్‌కు రూ.444 చెల్లించి టికెట్ తీసుకుంది. మనవరాలితో బస్సు ఎక్కిన ఆ మహిళ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన శక్తి స్కీమ్ కింద ఉచితంగా ప్రయాణం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిలుకల కోసం ఆ మహిళ తీసుకున్న టికెట్ వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
మైసూరుకు చెందిన ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు వచ్చింది. అక్కడ నాలుగు చిలుకలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం తిరిగి మైసూరు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. తాను కొనుగోలు చేసిన నాలుగు చిలుకలను పంజరంలో పెట్టి తీసుకొచ్చింది. బస్సులో తన పక్కన ఆ పంజరాన్ని పెట్టుకుంది. వెంటనే బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు చిలుకలను చూసి మురిసిపోయి ఫొటోలు తీసుకున్నారు.
ఒక్కొక్క చిలుకకు రూ.111
ఇంతలో ఆ బస్సు కండక్టర్ వచ్చి మహిళతోపాటు మనవరాలికి శక్తి పథకం కింద జీరో టికెట్ ఇచ్చారు. చిలుకలకు మాత్రం టికెట్లు కొనుగోలు చేయాలని చెప్పారు. దీంతో మహిళ ఎంత అని అడగ్గా, టికెట్ ప్రింట్ తీసి ఇచ్చారు కండక్టర్. ఒక్కొక్క చిలుకకు రూ.111 చొప్పున మొత్తం రూ.444 వసూలు చేశారు. చిలుకల టికెట్ ధర అందరి దృష్టిని ఆకర్షించింది. బస్సులో కొందరు ప్రయాణికులు టికెట్‌కు ఫొటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
కేఎస్ఆర్టీసీ నిబంధనలు ఇలా!
అయితే కేఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు బస్సులో తమ వెంటే తీసుకెళ్లే పెంపుడు జంతువులతోపాటు పక్షులకు హాఫ్ టికెట్ కొనుగోలు చేయాలి. ఒకవేళ వాటికి టికెట్ కొనుగోలు చేయకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే టికెట్ ధరతోపాటు 10 శాతం అదనంగా జరిమానా చెల్లించాలి. వివిధ సందర్భాల్లో కండక్టర్ జంతువులు, పక్షులకు హాఫ్ టికెట్ ఇవ్వకపోతే అతడిపై ఆర్టీసీ నిధుల ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. సంబంధిత కండక్టర్‌ను విధుల నుంచి సస్పెండ్ కూడా చేస్తామని వెల్లడించారు.