RSS Ban Removed : ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశంసించింది. ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. గతంలో ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని మునుపటి పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించింది.
"ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడం సరైన చర్య. ఈ నిర్ణయం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఆర్ఎస్ఎస్ గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణం, సమాజ సేవలో చురుకుగా పాల్గొంది. జాతీయ భద్రత, ప్రకృతి విపత్తుల సమయంలో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంఘ్ సహకారం అందించింది. కానీ, మునుపటి పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొకుండా నిషేధం విధించారు." అని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
#WATCH | On government employees can now participate in RSS activities, Sunil Ambekar, Akhil Bharatiya Prachar Pramukh, RSS says, " rashtriya swayamsevak sangh, for the last 99 years, has been continuously engaged in various works of nation building and social service...due to… pic.twitter.com/zOIsUIrh4E
— ANI (@ANI) July 22, 2024
కాంగ్రెస్ ఫైర్
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల తటస్థ భావజాలానికి సవాలుగా మారుతుందని ఆరోపించింది. 1947లో జాతీయ జెండాను దేశం స్వీకరించిందని, అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
"మహాత్ముడి హత్య తర్వాత 1948 ఫిబ్రవరి 4న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని 1966లో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. 58 ఏళ్ల తర్వాత మోదీ ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అన్ని రాజ్యాంగ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను సంస్థాగతంగా స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎలా వాడుకుంటుందో మాకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా మోదీ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులపై సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయం చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం మార్చాలనే ఆలోచనను ప్రజలు ఓడించడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. మోదీ సర్కార్ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ సాధించడానికి, రాజ్యాంగాన్ని మార్చేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తాయి."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
"గాంధీజీ హత్య తర్వాత 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. మంచి ప్రవర్తన హామీతో ఆ నిషేధాన్ని తొలగించారు. కానీ 1966లో మళ్లీ ఆ నిషేధం అమల్లోకి వచ్చింది." అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. జూన్ 4(ఎన్నికల ఫలితాలు) తర్వాత ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. వాజ్ పేయీ హయాంలో కూడా ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారని ఎక్స్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
'కాంగ్రెస్కు బుజ్జగింపు రాజకీయాలపై ఆసక్తి'
ఆర్ఎస్ఎస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్వాగతించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలపై మాత్రమే ఆసక్తి చూపుతుందని విమర్శించారు. హిందూ సమాజం పట్ల వారి వైఖరి చాలా ప్రతికూలంగా ఉందని ఆరోపించారు.
"రాజకీయ కారణాలతో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై కాంగ్రెస్ నిషేధం విధించింది. ఆర్ఎస్ఎస్ దేశభక్తి కలిగిన సంస్థ. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ దేశభక్తితో ఉంటారు. సామాజిక సంస్థలపై కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యతిరేక భావజాలం ఉంటుంది. ఆర్ఎస్ఎస్లో కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొనేలా సడలింపులు ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు." అని పీయూశ్ గోయల్ వ్యాఖ్యానించారు.
#WATCH | On government employees can now participate in RSS activities, Union Minister Piyush Goyal says, " ...i welcome this. the decision that had been taken by the congress party out of political reasons - the scrapping of that order is welcome. i believe that congress party's… pic.twitter.com/TYeWkI4Mhs
— ANI (@ANI) July 22, 2024
'లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చేశారు- ఈ బడ్జెట్ దానికోసమే!' - Parliament Budget Session 2024