Road Wedding In Kerala : రోడ్డు వేసేందుకు నిధులు లేక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు కేరళ కోజీకోడ్లోని కొడియాత్తూరు గ్రామస్థులు. ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు. ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు బిర్యానీ, స్వీట్లు వడ్డించారు. గ్రామస్థులంతా ఏకమై రోడ్డు వివాహాన్ని సంబరంలా జరుపుకున్నారు. ఎందుకు వీరు ఇలా చేశారంటే?
పనం పయట్టు లేదా కురికల్యాణం అనేది ఉత్తర కేరళలో ఒక దేశీయ ఆర్థిక సహకర వ్యవస్థ. పనం పయట్టును గ్రామస్థులు నిధుల సేకరణ కోసం చేస్తారు. తమ కలల రహదారి నిర్మాణం కోసం కొడియాత్తూరు గ్రామస్థులు పనం పయట్టు సంప్రదాయాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో వెస్ట్ కొడియాత్తూరు- కజైక్కల్- ఎడవజిక్కడవ్ రహదారిని పూర్తి చేసేందుకు నిధుల కోసం స్థానికులు రోడ్డుకు వివాహం చేశారు. ఈ వివాహానికి విదేశీ పర్యటకుల సైతం హాజరయ్యారు. స్థానికులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.
మంచి రోడ్డు కోసం 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని స్థానిక నివాసి పీకే ఫైజల్ చెబుతున్నాడు. అందుకోసం దాదాపు అరవై లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని అన్నాడు. ఆ డబ్బు వసూలు చేయడానికే ఈ రోడ్డుకు పెళ్లి చేశామని చెప్పాడు. 'ఇది ఊరి పండగ. అందరం ఆనందంగా గడిపాం.' అని మరో మహిళ హసీబా అన్నారు.
కొడియాత్తూరులో 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పైన రోడ్డు ఉంది. దీనిని 1980ల్లో నిర్మించారు అధికారులు. ఈ 4 దశాబ్దాలలో ఈ ఊరి జనాభా 3రెట్లు పెరిగారు. అలాగే వాహన రాకపోకలు సైతం భారీగా పెరిగాయి. దీంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయడం, రోడ్డు విస్తరణ పనుల కోసం కొన్నాళ్లుగా గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు. అయినా కొన్ని కారణాల వల్ల కుదరట్లేదు. రోడ్డు విస్తరణ పనులు కొడియాత్తూరుకు చెందిన 500 కుటుంబాలకు తీరని కోరికగా మిగిలిపోయింది. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేపట్టాలని గ్రామస్థులు నిర్ణయించి ఒకచోట సమావేశమయ్యారు. రహదారి విస్తరణలో దాదాపు 107 కుటుంబాలు తమ భూమిని కోల్పోతాయని అంచనా వేశారు. వారికి పరిహారం, రహదారి నిర్మాణం కోసం రూ. 60 లక్షలు అవుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలో క్రౌడ్ ఫండింగ్ చేపట్టాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు 15మంది ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున 15లక్షల రూపాయలు విరాళం అందించారు. ఇంకా వారికి రూ.45లక్షలు అవసరం. అప్పుడే వారి ఒక ఆలోచన వచ్చింది. ఆర్థిక ప్రయోజనాలను తీర్చుకోవడానికి తమ పూర్వీకులు వాడిన పనం పయట్టు సంప్రదాయాన్ని వాడి డబ్బును సమకూర్చారు.
అసలేంటి 'పనం పయట్టు' లేదా కురికల్యాణం
'పనం పయట్టు'లో డబ్బు అవసరమైన వ్యక్తి 'పయట్టు' నిర్వహిస్తారు. అతడికి ఆర్థిక సాయం చేయడానికి కొందరు ముందుకొస్తారు. ఆ తర్వాత అతడు ఆ డబ్బులను వడ్డీ లేకుండా తిరిగి ఇచ్చేస్తాడు. సాధారణంగా ఉత్తర కేరళ ప్రాంతంలో పనం పయట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అతిథులకు టీ, టిఫిన్లు వడ్డిస్తారు. కొందరైతే బిర్యానిని సైతం వడ్డిస్తారు.
28 వెడ్స్ 14- పేరెంట్స్కు తెలియకుండా మ్యారేజ్, పుట్టింటికి పంపించనని వింత వాదన!
తల్లిదండ్రులు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం.. గుజరాత్లో కొత్త రూల్! రాజ్యాంగం అనుమతిస్తుందా?