Amit Shah On Lok sabha Election : రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలవాలనుకుంటుందని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. గత పదేళ్లుగా తమకు పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉందని, కానీ ఎప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలనుకోలేదన్నారు. దేశ రాజకీయాల్లో సుస్థిరతను తీసుకువచ్చేందుకు ఎన్డీఏ 400కంటే ఎక్కువ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తమకు ఎలాంటి ప్లాన్ బీ లేదని, అద్భుతమైన మెజారిటీతో మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"గత 10 ఏళ్లుగా ఎన్డీఏకు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మార్చే మెజారిటీ ఉంది. కానీ మేము ఎప్పుడూ అలా ఆలోచించలేదు. రాహుల్ బాబా అండ్ కంపెనీ ఇలా దుష్ప్రచారం చేస్తుంది. దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి, భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు, మరికొంత మంది పేదలకు భరోసా ఇవ్వడానికి 400 సీట్లను ఎన్డీఏ గెలవాలి. ఎందుకంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇంకా అందలేదు. 70 ఏళ్లు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలనుకుంటున్నాం. మేము ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం, యూసీసీను తీసుకొచ్చాం. అలాగే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాం. మెజారిటీని దుర్వినియోగం చేసిన చరిత్ర బీజేపీకి లేదు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో మెజారిటీని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించింది. లక్షన్నర మందిని అకారణంగా 19నెలల పాటు జైల్లో పెట్టింది. రాహుల్ బాబా వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. దేశంలోని యువత 30 ఏళ్లుగా అస్థిర ప్రభుత్వాలను చూశారు. మోదీ హయాంలో సుస్థిర ప్రభుత్వాలను రెండు దఫాలుగా చూశారు. మరోసారి స్థిరమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుంది."
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని చూసినప్పుడల్లా ప్రజలకు లిక్కర్ స్కామ్ గుర్తుకు వస్తుందని షా ఎద్దేవా చేశారు. 'దిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. జూన్ 1న ఆయన మళ్లీ జైలుకు వెళ్లాలి.' అని అమిత్ షా విమర్శించారు.
ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం
ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని పోలుస్తూ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. దక్షిణాదిని ప్రత్యేక దేశంగా పరిగణించడం అత్యంత అభ్యంతరకరం అని వ్యాఖ్యానించారు. ' భారత్‌ను మళ్లీ ఎప్పటికీ విభజించలేం. ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని విభజించండి అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. ఇలా దేశాన్ని విభజించడం కాంగ్రెస్ ఎజెండా. దక్షిణాది ప్రత్యేక దేశం అని ఎవరైనా చెబితే అది చాలా అభ్యంతరకరం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ మెరుగైన పనితీరు కనబరుస్తుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది.' అని షా వ్యాఖ్యానించారు.
-
#WATCH | On foreign media's "BJP throttling democracy by wanting 400 plus seats" take, Union Home Minister Amit Shah says, "...Should the voters of the country vote as per the intent of the foreign media?...There is no interference. Anyone can say anything they want but the… pic.twitter.com/tnxHJ9feh3
— ANI (@ANI) May 17, 2024
'ఆర్టికల్ 370 విజయానికి ఇదే నిదర్శనం'
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 14 శాతం నమోదైన ఓటింగ్, ఈ ఎన్నికల్లో దాదాపు 40 శాతానికి పెరిగిందని అమిత్ షా తెలిపారు. ఈ ఓటింగ్ పెరుగుదలే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం విజయవంతమైందని తెలుపుతుందని చెప్పారు. 'గతంలో కశ్మీర్ లోయలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని తీవ్రవాద గ్రూపులు పిలుపునిచ్చేవి. ఈ లోక్ సభ ఎన్నికల్లో తీవ్రవాద గ్రూపులు నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరికి ఓటు వేస్తారనేది ముఖ్యం కాదు. అది వారి హక్కు. కానీ కనీసం ప్రజాస్వామ్య ప్రక్రియలో వారు భాగమయ్యారు. ఎన్నికల సమయంలో శ్రీనగర్ లో హింసాత్మక ఘటనలు జరగలేదు. రిగ్గింగ్ జరగలేదు.' అని షా వ్యాఖ్యానించారు.
2029 వరకు మోదీయే ప్రధాని- ఆ తర్వాత కూడా ఆయనే!: అమిత్ షా - Lok Sabha Elections 2024